హైదరాబాద్: టీఆర్ఎస్ ముఖ్య నేత హరీష్ రావు కీలకమైన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో మచ్చుకైనా కానరాకపోవటంపై ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. హరీష్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని వార్తలు వస్తున్నాయని తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నిన్న అన్నారు. టీఆర్ఎస్పై, కేసీఆర్ కుటుంబంపై రేవంత్ రెడ్డి విమర్శలు కాస్త శృతిమించినట్లు ఉంటాయి కాబట్టి వాటిని పెద్దగా పట్టించుకోనవసరం లేదనిపించినా, హరీష్ గైర్హాజరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందనేది మాత్రం వాస్తవం.
గ్రేటర్ ఎన్నికలలో అసలు ముఖ్యమంత్రి కేసీఆరే ఇప్పటివరకు అడుగు పెట్టలేదు. కేటీఆర్ ఒంటిచేత్తో అంతా తానై నడిపిస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక, బుజ్జగింపు, ప్రచారం, ప్రత్యర్థులకు సవాళ్ళు, ప్రతిసవాళ్ళు విసరటం, మేనిఫెస్టే విడుదల వంటి అన్ని అంశాలనూ కేటీఆరే చూసుకుంటున్నారు. కేటీఆర్ సోదరి కవిత ఇంకోవైపు నుంచి ప్రచారం చేసుకుంటూ వెళుతున్నారు. రెండు రోజుల క్రితం కవితవద్ద హరీష్ విషయాన్ని విలేకరులు లేవనెత్తారు. హరీష్ త్వరలో గ్రేటర్ ప్రచారంలో పాల్గొంటారని, సికింద్రాబాద్ ప్రాంతంలో పర్యటిస్తారని కవిత చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటివరకు ప్రచారంలో హరీష్ జాడలేదు. అసలు హరీష్ నగరంలో లేరా అంటే అదేమీ కాదు. హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన ఒక సినిమా ఫంక్షన్‌కు, బాబూ మోహన్‌కు డాక్టరేట్ ఇచ్చే కార్యక్రమానికి హరీష్ హాజరయ్యారు. రోజూ మినిస్టర్ క్వార్టర్స్‌కు వస్తున్నారు. కానీ మీడియాతో గ్రేటర్ ఎన్నికలపై ఒక్కమాట కూడా మాట్లాడటంలేదు. ఆయనను నమ్ముకున్న కొందరు నేతలకు కూడా టిక్కెట్లు లభించలేదని అంటున్నారు. ఈ పరిణామాలన్నింటితో హరీష్‌పై ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. హరీష్‌ను తొక్కేశారనే వాదనైతే బలంగా వినిపిస్తోంది. ఏది ఏమైనా కేసీఆర్ తన వారసుడిగా కేటీఆర్‌ను తయారు చేస్తున్నారనైతే స్పష్టంగా తెలుస్తోంది. హరీష్‌కు ఏమాత్రం సందిచ్చినా అతను చెలరేగుతాడని కేసీఆర్ భావనగా కనిపిస్తోంది.