తెలంగాణ ప్రభుత్వంలో అనూహ్యమైన మార్పు కనిపిస్తోంది. హరీష్ రావుకు పెరిగిన ప్రాధాన్యం ఎవరూ ఊహించని విధంగా ఉంది. గతంలో ఎక్కడ ఆకస్మిక తనిఖీలు చేసినా.. అభివృద్ధి కార్యాక్రమాలు ప్రారంభించినా… ఏదైనా సరే మంత్రి కేటీఆర్ కనిపించేవారు. కానీ ఇప్పుడు హరీష్ రావు కనిపిస్తున్నారు. ఆర్థిక, వైద్య ఆరోగ్య మంత్రిగా హరీష్ రోజూ మీడియాలో హైలెట్ అవుతున్నారు. కానీ కేటీఆర్ మాత్రం పెద్దగా కనిపించడం లేదు. ఆయన పాల్గొనే కార్యక్రమాలు కూడా తగ్గిపోయాయి. వైద్య ఆరోగ్య మంత్రిగా బాధ్యతలు తీసుకున్న హరీష్ రావు తనదైన పనితీరు చూపిస్తున్నారు.
సమీక్షలు.. సమావేశాలు.. ప్రారంభోత్సవాలతో హోరెత్తిస్తున్నారు. కొన్ని కార్యక్రమాల్లో కేటీఆర్ పాల్గొంటున్నా కూడా హరీష్ రావే హైలెట్ అవుతున్నారు. ఓ వైపు ఆర్థిక మంత్రిగా హడావుడిగానే ఉంటున్నారు. ఇటీవల వరంగల్‌లో సెంట్రల్ జైలును కూలగొట్టి ఆస్పత్రిని నిర్మించాలని నిర్ణయించారు. హడావుడిగా కూలగొట్టారు. కానీ రెండు రోజుల కిందటే నిధులు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి కూడా హరీష్ రావును పొగడ్తలతో ముంచెత్తాయి.
మామూలుగా అయితే ఈ హడావుడి కేసీఆర్, కేటీఆర్‌లకు నచ్చదని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నారు. వారికి నచ్చని పని హరీష్ కూడా చేయరని.. కానీ వారే హరీష్ ను ప్రోత్సహిస్తున్నారని భావిస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్ అండర్ ప్లే చేస్తున్నారని హరీష్ రావును ముందు పెడుతున్నారన్న అభిప్రాయం అధికారవర్గాల్లోనూ వినిపిస్తోంది. అదే నిజం అయితే కేసీఆర్, కేటీఆర్ వ్యూహం ఏమై ఉంటుందా అన్న చర్చ సహజంగానే వస్తుంది.