మల్లన్నసాగర్ భూసేకరణపై ప్రస్తుతం తెలంగాణా ప్రభుత్వం-ప్రతిపక్ష పార్టీల మధ్య జరుగుతున్న జరుగుతున్న గొడవని అందరూ చూస్తూనే ఉన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకి తెలంగాణా నీటి పారుదల శాఖా మంత్రి హరీష్ రావు ఈరోజు సమాధానం చెప్పారు.
అయన మీడియాతో మాట్లాడుతూ, “మల్లన్నసాగర్ ప్రాజెక్టుని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్, వామపక్షాల నేతలు నేను అడుగుతున్న ప్రశ్నలకి జవాబులు చెప్పాలి. కర్నాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బెంగళూరు-చెన్నై ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణం కోసం 4,000 ఎకరాలు సేకరించిన మాట వాస్తవమా కాదా? మేమేదో ఆరు గ్రామాలలో 16,000 ఎకరాలు మాత్రమే సేకరిస్తున్నాము. కానీ కర్ణాటక ప్రభుత్వం దేశంలోకెల్లా అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు కడుతోంది. దాని కోసం 22 గ్రామాలలో 1.20 లక్షల ఎకరాలు సేకరిస్తోంది. వీటిపై జైపాల్ రెడ్డిగారు ఏమంటారు? సమాధానం చెప్పాలి.”
“పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సిపిఎం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇండోనేషియా కంపెనీ కోసం నందిగాంలో 10,000 ఎకరాలు సేకరించిన మాట వాస్తవం కాదా? అప్పుడు రైతులు వ్యతిరేకిస్తే వారిపై పోలీసులు కాల్పులు జరిపినపుడు 14 మంది మరణించడం, అనేకమంది గాయపడటం నిజమా కాదా? అని నేను మన వామపక్షాల నేతలని అడుగుతున్నాను. అక్కడ వారి ప్రభుత్వాలు చేస్తే మాట్లాడని వారు, ఇక్కడ మా ప్రభుత్వాన్ని ఎందుకు తప్పు పడుతున్నారు? అని హరీష్ రావు ప్రశ్నించారు.
దేశంలో ఏ ప్రభుత్వమైనా అభివృద్ధి పనుల కోసం భూసేకరణ చేయడం, అప్పుడు ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించడం సర్వ సాధారణమైన విషయమే. తెలంగాణాలో కూడా ప్రస్తుతం అదే జరుగుతోంది. రేపు ఒకవేళ తెరాస స్థానంలో వేరే ప్రభుత్వం అధికారంలోకి వస్తే అప్పుడు తెరాస కూడా భూసేకరణని వ్యతిరేకించవచ్చు. భూసేకరణ కారణంగా నిరుపేద రైతులు, కూలీలు, వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నవారు తరచూ నష్టపోతుంటారు. రాష్ట్రం కోసం బలవంతంగా త్యాగాలు చేయిస్తున్నప్పుడు, వారిని ఆదుకోవలసిన బాధ్యత ఆ ప్రభుత్వానిదే. కానీ పని పూర్తి కాగానే ప్రభుత్వాలు భూములు ఇచ్చిన రైతులని, ఆ కారణంగా వారు పడుతున్న కష్టనష్టాలని పట్టించుకోవడం మానేస్తాయి. వారిగోడు వినేవారే ఉండరు. తెలంగాణా సాగునీటి ప్రాజెక్టుల కోసం భూములు ఇస్తున్న ప్రతీ ఒక్క రైతుని ఆదుకొనే బాధ్యత తనదేనని భూసేకరణ ప్రక్రియని దగ్గరుండి జరిపిస్తున్న మంత్రి హరీష్ రావు హామీ ఇస్తున్నారు. ఆయన ఆ హామీ నిలబెట్టుకొంటారో లేదో కాలమే చెప్పాలి.