హైదరాబాద్: కేటీఆర్కు, తనకు మధ్య ఎలాంటి గ్యాప్ లేదని, తామిద్దరమూ కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్నామని, బంగారు తెలంగాణకోసం పనిచేస్తున్నామని హరీష్ రావు చెప్పారు. కొంతమంది పనిలేని, తలకు మాసిన నాయకులు కేవలం నోటి దురుసుతనంతో మీడియాలో హెడ్లైన్స్ కోసం ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారని అన్నారు. అవన్నీ సొల్లు కబుర్లని, వాటికి తాము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని చెప్పారు. తాను, కేటీఆర్ కలిసి ఉండటం చూసి ఓర్వలేని వ్యక్తులే ఇలాంటి వార్తలను తెరపైకి తెస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు తామిద్దరమూ ఇష్టమేనని చెప్పారు. ముఖ్యమంత్రి కావాలన్న కోరిక తనకు లేదని చెప్పారు. తాను, కేటీఆర్, కవిత బ్యాక్ డోర్నుంచి రాజకీయాలలోకి రాలేదని, ఉద్యమంలో కష్టపడి, ప్రజల ఆశీస్సులతోనే భారీ మెజార్టీతో గెలిచి పదవులు చేపట్టామని వ్యాఖ్యానించారు. కుటుంబ రాజకీయాలన్న ఆరోపణలపై స్పందిస్తూ, ప్రతిపక్షాలకు టీఆర్ఎస్ పాలనపై విమర్శించటానికి ఏమీ దొరకక ఈ ఆరోపణలు చేస్తున్నాయని అన్నారు. ఎన్నికల ప్రచారంలో ఎదురవుతున్న నిరసనలపై స్పందిస్తూ, పదివేలమంది ఉన్నపుడు ఇద్దరో, ముగ్గురో ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలు ఉండొచ్చని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉనికి లేని పార్టీ అని అన్నారు. వైసీపీ, తెలుగుదేశం ఆంధ్రా పార్టీలని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరమే లేదని చెప్పారు. శృతి ఎన్కౌంటర్ బాధాకరమని హరీష్ అన్నారు.