కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాగానే తొలి సంతకం ప్రత్యేక హోదా ఫైల్ మీదే ఉంటుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పదేపదే హామీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ రాష్ట్రంలో అధికార తెరాసకు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీయే కదా! పైగా, ఇతర పార్టీలతో మహా కూటమి ఏర్పాటు చేసుకుని మరీ తెరాసపై పోరాటానికి సిద్ధమౌతోంది. ఈ నేపథ్యంలో ఏపీకి కాంగ్రెస్ ఇచ్చిన హామీని… తెలంగాణలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మార్చే పనిలో పడ్డట్టున్నారు మంత్రి హరీష్ రావు. సిద్ధిపేట పరిధిలో ఓ సభలో ఆయన పాల్గొన్నారు. మహా కూటమిని విమర్శిస్తూ… కుర్చీల కోసం అన్ని పార్టీలూ ఒకటౌతున్నాయనీ, వారంతా గుంపుగా వచ్చినా తెరాస సమర్థంగా ఎదుర్కొంటుందని హరీష్ రావు అన్నారు.
కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ రాహుల్ గాంధీ హామీ ఇస్తున్నారనీ, అదే జరిగితే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది కదా అని హరీష్ రావు వ్యాఖ్యానించారు. అంటే, ఏపీకి హోదా వస్తే… అదనపు రాయితీలు వస్తాయనీ, దాంతో పరిశ్రమలు అక్కడికి తరలిపోయే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని ప్రజల్లోకి ఇంజెక్ట్ చేయడమే హరీష్ వ్యాఖ్యల వెనక ప్రయత్నం అనుకోవచ్చు. ఆంధ్రాలో హోదాకి మద్దతు ఇవ్వడం ద్వారా… తెలంగాణకు ద్రోహం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఓడించాలనే వాదనను వినిపించే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే, ఇక్కడ హరీష్ మిస్ అవుతున్న అంశం ఏంటంటే… ఏపీకి ప్రత్యేక హోదా రావడాన్ని తెరాస నిరసిస్తోందన్న అభిప్రాయం ఈ వ్యాఖ్యల ద్వారా కలుగుతోంది కదా! తెలంగాణ జిల్లాల్లో సెటిలర్లు చాలామంది ఉన్నారు. వారిని ఈ వ్యాఖ్యలు ప్రభావితం చేసే అవకాశం కచ్చితంగా ఉంటుంది. నిజానికి, ఆంధ్రాకి హోదా ఎవరిచ్చినా… తెలంగాణకు వచ్చే నష్టం ఏముంటుంది..? జరిగిపోయే అన్యాయం ఎక్కడ ఉంటుంది..? కొన్ని నెలల కిందట కూడా ఇలాంటి వాదననే తెరాస వినిపించింది. ఆంధ్రాకి కేంద్రం ఏమిచ్చినా… దానికి సమానంగా తమకీ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ మీద వ్యతిరేకత పెంచడం కోసం… మరోసారి ఏపీ హోదా అంశాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ ను విమర్శించాలంటే ఇతర అంశాలు చాలా ఉన్నాయి. పక్క రాష్ట్రానికి ఇచ్చిన హామీని తెలంగాణలో ప్రస్థావించాల్సిన అవసరం ఏముంది..?