హైదరాబాద్: వరంగల్ లోక్సభ ఉపఎన్నికలో ఖచ్చితంగా గెలిచి తీరుతామని టీఆర్ఎస్ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉపఎన్నిక ఫలితం తమ పార్టీ పాలనపై రిఫరెండమ్ అని మొన్న పంచాయతీ, ఐటీ శాఖలమంత్రి కేటీఆర్ ప్రకటించగా, తాజాగా నీటిపారుదల శాఖమంత్రి హరీష్ రావుకూడా అదే విధంగా వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ 500 రోజుల పరిపాలనపై 50 ప్రశ్నలు అంటూ కాంగ్రెస్ నిన్న విడుదల చేసిన పుస్తకంపై స్పందిస్తూ, ప్రతిపక్షనేతలు గ్రామాలలోకి వెళ్ళి ప్రజలతో మాట్లాడితేనే ప్రభుత్వం చేసిన కృషి తెలుస్తుందని అన్నారు. హైదరాబాద్లో కూర్చుని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఉపయోగం లేదని చెప్పారు. ఈ ఉపఎన్నిక ఫలితం టీఆర్ఎస్ గెలిస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. తెలంగాణ వెనకబాటుతనానికి దశాబ్దాలపాటు జరిగిన కాంగ్రెస్ పరిపాలనే కారణమని చెప్పారు. హామీలు నెరవేర్చకపోతే తమ పార్టీకి తిరిగి ఓట్లు అడగబోనని బహిరంగంగా ప్రకటించిన నేత దేశం మొత్తంలో కేసీఆర్ తప్ప మరెవరూ లేరని అన్నారు. టీఆర్ఎస్ చేసిన ప్రతి వాగ్దానాన్ని అమల్లోకి తెస్తున్నదని చెప్పారు. ఎన్నికలముందు అద్భుతాలు చేస్తామని చెప్పి ఆ తర్వాత మాట మార్చటం తమ పార్టీ చరిత్రలో లేదన్నారు.
సింగరేణి కార్మికులను, ఆర్టీసీ డిపో కార్మికులను, వెయ్యి రూపాయల పెన్షన్ తీసుకుంటున్న వికలాంగులు, వృద్ధులు, వితంతువులను, అంగన్ వాడీ కార్యకర్తలను అడిగితే టీఆర్ఎస్ ఏమి చేసిందో, కేసీఆర్ ఏమి చేశారో చెబుతారని కాంగ్రెస్ నాయకులకు సూచించారు. రు.20 వేల కోట్లతో రహదారులను అభివృద్ధి చేస్తున్నామని హరీష్ రావు చెప్పారు.