హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో హరీష్ రావు త్వరలో పాల్గొనబోతున్నారంటూ కవిత ఇటీవల మీడియాతో చెప్పినప్పటికీ, ప్రచారం ముగియబోతున్నాకూడా ఆయన ఇటువైపు కన్నెత్తయినా చూడటంలేదు. అయితే హైదరాబాద్లో ఇతర పనులు చూసుకుంటున్నారు, ప్రైవేట్ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. దీనర్థం ఏమిటో చిన్న పిల్లలకైనా స్పష్టంగా అర్థమవుతోంది. అయితే బయటకుమాత్రం అంతా మామూలుగానే ఉందని కలర్ ఇవ్వటానికి ప్రయత్నిస్తున్నారు హరీష్ రావు. నిన్న మీడియాతో మాట్లాడుతూ, గ్రేటర్ ఎన్నికల్లో తనను దూరం పెట్టారన్న వార్తలు న్యూసెన్స్ అని అన్నారు. రాజకీయంగా తనను ఎదుర్కొనలేక ఇలా చౌకబారు ప్రచారం చేస్తున్నారంటూ ఇదే విషయంపై టీడీపీ నేత రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ వ్యాఖ్యానించారు. తామంతా ఒక్కటిగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. నారాయణఖేడ్ అసెంబ్లీ ఉపఎన్నికలు, గ్రేటర్ ఎన్నికలు ఒకేసారి వచ్చాయని, రెండు ఎన్నికలూ తమకు ముఖ్యమేనని అన్నారు. జిల్లా మంత్రిగా నారాయణఖేడ్ ఉపఎన్నిక బాధ్యతలను సీఎమ్ తనకు అప్పగించారని చెప్పారు. గ్రేటర్ ఎన్నికల బాధ్యతను రాముకు, ఇతర మంత్రులకు ఇచ్చారని హరీష్ వివరణ ఇచ్చారు.