ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత చర్చలో ప్రభుత్వాన్ని హరీష్ రావు ఎదుర్కొన్న తీరు బీఆర్ఎస్ వర్గాలను సంతృప్తి పరిచింది. ఆయన సూటిగా సుత్తి లేకుండా… అధికార పార్టీని ఇరుకున పెట్టిన వైనం.. ఆకట్టుకుంది. శ్వేతపత్రాన్ని ఆంధ్రా అధికారులు తయారు చేశారని ఆరోపించి మొదట అధికారపక్షాన్ని కార్నర్ చేశారు. ఆ తర్వాత అందులోతప్పులు ఉన్నాయని బలంగా వాదించారు. చివరికి సీఎం రేవంత్ రెడ్డి కూడా శ్వేతపత్రం ఎవర్నో బ ద్నాం చేయడానికి కాదని.. అందులో ఎవరిపైనా విమర్శలు లేవని.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తెలియచేయడానికి మాత్రమే రూపొందించారని చెప్పాల్సి వచ్చింది.
రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని.. బీఆర్ఎస్ పై కాంగ్రెస్ నేతలు, ప్రభుత్వం తీవ్రంగా విరుచుకుపడుతుందని.. తమపై నిందలేస్తారని..కడుక్కోలేక ఇబ్బంది పడాలని బీఆర్ఎస్ అనుకుంది. కానీఆ దాడిని హరీష్ రావు ఇంత సమర్థంగా కాచుకుంటారని…తెలంగాణ సెంటిమెంట్ ను పక్కాగా ఉపయోగించుకుంటారని అనుకోలేదు. అందుకే.. బీఆర్ఎస్ నేతల్లో ఉత్సాహం కనిపిస్తోంది. ఈ ఎపిసోడ్ మొత్తంలో కేటీఆర్ కనిపించలేదు. ప్రసంగించలేదు. అసలు ఆయన సభకు వచ్చినట్లుగా కూడా లేరు. కానీ సభ అయిపోయాక ట్వీట్ చేశారు.
ప్రస్తుతం కేసీఆర్ గాయం కారణంగా అసెంబ్లీ సమావేశాలకు రావడంలేదు. వస్తారన్న గ్యారంటీ లేదు. ఆయన ప్రతిపక్ష నేత అయినప్పటికీ.. సభలో అనధికారికంగా అయినా బీఆర్ఎస్ ను నడిపించేందుకు నేత కావాల్సిఉంది. అది హరీష్ రావా.. కేటీఆరా అన్నదానిపై స్పష్టత లేదు. ఆర్థిక శాఖపై చర్చ తర్వాత హరీష్ రావుకు.. బీఆర్ఎస్ లో మద్దతు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.