తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అంతర్గత వారసత్వ పోరాటంలో వెనక్కు తగ్గినట్టే కనిపిస్తుంది. ముఖ్యమంత్రి కెసిఆర్ కుమారుడైన కెటిఆర్‌ను ప్రతి సందర్భంలో ప్రమోట్ చేయడం ఇబ్బంది కలిగిస్తున్నా ప్రశ్నించలేని స్థితిలో పడిపోయారు.ఇప్పటికిప్పుడు ఘర్షణ పెట్టుకోకున్నా తన స్వంత పునాదిని కాపాడుకోవడంపైనా కేంద్రీకరించడం లేదు. చెప్పాలంటే తండ్రీ కొడుకులను సంతృప్తిపెట్టడమే మంచిదనే నిర్ధారణకు వచ్చారా? ఈ మద్య ఒక కార్యక్రమంలో హరీష్ మాట్లాడుతూ కెటిఆర్ డైనమిక్ లీడర్ అని పొగిడినట్టు పత్రికల్లో వచ్చింది. ఇదే నిజమైతే నిజంగా వెనుకడగే. ఎందుకంటే సమకాలీకుడేగాక టిఆర్ఎస్ పెరుగుదలలో ఒకడుగు తక్కువైన కెటిఆర్‌ను హరీష్ పొగడాల్సిన అవసరమే లేదు! ఆయనే ఇలా మాట్లాడుతుంటే తామేం చేస్తామని ఆయన అనునోయులు ఆశ్చర్యపోతున్నారు. ఇంతగా తగ్గి మాట్లాడాల్సిన పనిలేదుగాని ఎందుకు బలహీనపడుతున్నారో తెలియడం లేదంటున్నారు. కాకపోతే తెలంగాణలో ప్రస్తుతానికి కెసిఆర్ కు తిరుగులేదు గనక ఆయన ఆలోచనలను ఆక్షేపించినట్టు కనిపించే సూచనలైనా ఇవ్వకూడదని హరీష్ భయపడుతున్నారు. అయితే ఈ లోటును భర్తీ చేసుకోవడం కోసం నీటి ప్రాజెక్టులపై ఆంధ్ర ప్రదేశ్‌పై అవసరానికి మించి విరుచుకుపడుతున్నారు. ఆ విషయంలో కెసిఆర్ కన్నా హరీష్ బాష తీవ్రంగా వుంటున్నది. కెటిఆర్ తెలుగువారందరినీ ఆకట్టుకునేలా వ్యవహరిస్తుంటే హరీష్ అందుకు భిన్నమైన వ్యూహం చేపట్టడం కూడా సరికాదని ఆయన శిబిరంలో వారే అంటున్నారు. పైగా ఈ రంగం నేరుగా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నప్పుడు నిర్ణయాలు ప్రకటిస్తున్నప్పుడు హరీష్ ఎంత శ్రమ పడినా పెద్ద ప్రభావం వుంటుందా అనేది కూడా సందేహమే. ఏది ఏమైనా ఆయనకు ఇది గడ్డుకాలమే. మంత్రివర్గంలో కాస్తయినా స్వంత గొంతు వుంది ఆయనకే గనక హరీష్ మరీ దిగివస్తారేమోనని అనునోయులు ఆందోళన చెందుతున్నారు.