మంత్రి హరీష్ రావుకు దుబ్బాక ఎన్నికలు కత్తిమీద సాములా మారాయి. అభ్యర్థిగా కేసీఆర్ సోలిపేట రామలింగారెడ్డి భార్యను ఎంపిక చేశారు. ఆమెకు రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియని పరిస్థితి. ఏం మాట్లాడాలో.. ఎలా మాట్లాడాలో తెలియక పోవడంతో… హరీష్ రావుకు మరంత భారం పెరిగింది. అందుకే… భిన్నమైన వ్యూహాన్ని ఎంచుకుంటున్నారు. దుబ్బాకలో తనను చూసి ఓటేయాలని ప్రచారం చేస్తున్నారు. సిద్దిపేట.. దుబ్బాక తనకు రెండు కళ్లు అని ..టీఆర్ఎస్ను గెలిపిస్తే.. దుబ్బాకను సిద్దిపేటలా అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తూ.. గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. హరీష్ రావు ఇప్పటికే ఓ సారి గ్రామాల్ని చుట్టేశారు. మరోసారి అభ్యర్థిని వెంట పెట్టుకుని నియోజకవర్గాన్ని చుట్టబెట్టాలని నిర్ణయించుకున్నారు.
హరీష్ రావు రాజకీయ వ్యూహాలను పక్కాగా అమలు చేయడంలో దిట్ట. పరిస్థితుల్ని అర్థం చేసుకుని .. అభ్యర్థిని సానుభూతి కోసం వాడుకుని అభివృద్ధికి మాత్రం తనను ముందు పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో రెండు కళ్ల సిద్ధాంతం తెరపైకి వచ్చింది. దుబ్బాకలో.. గత ఆరేళ్లుగా ఎలాంటి పనులు జరగలేదన్న అసంతృప్తి అక్కడి ప్రజల్లో ఉంది. దీన్ని తగ్గించడానికే.. తానొచ్చానన్న అభిప్రాయాన్ని కల్పించడానికి హరీష్ ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో.. విపక్షాలు… భిన్నమైన వ్యూహంతో దూసుకెళ్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ.. టీఆర్ఎస్ నుంచి చెరుకు శ్రీనివాస్ రెడ్డిని చేర్చుకుని టిక్కెట్ ఇచ్చింది. నియోజకవర్గ వ్యాప్తంగా అనుచరులు ఉన్న శ్రీనివాస్ రెడ్డిని హరీష్ తక్కువగా అంచనా వేయడం లేదు.
కాంగ్రెస్లో ఉన్న చెరుకు శ్రీనివాస్ రెడ్డి వ్యతిరేకుల్ని పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే కొంత మంది నేతలకు కండువాలు కప్పారు. ఇతర నేతలపైనా గురి పెట్టారు. హరీష్ రావు.. రాజకీయం .. ప్రజల్ని ఆకట్టుకునే విషయం కన్నా.., ప్రత్యర్థుల్ని బలహీనుల్ని చేసి.. వారు పోటీ లేరన్న అభిప్రాయం కల్పించడానికి ప్రయత్నించి సక్సెస్ అవుతారు. ప్రస్తుతం దుబ్బాకలోనూ అదే చేస్తున్నారు. మరి సక్సెస్ అవుతారో లేదో వేచి చూడాలి..!