కొడంగల్ నియోజక వర్గం రేవంత్ రెడ్డికి కంచుకోట. అయితే, గత అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ ఆయన ఓడిపోయారు. రేవంత్ ని ఓడగొట్టడం కోసం మంత్రి హరీష్ రావు ప్రత్యేకంగా ఆ నియోజక వర్గం మీద దృష్టిపెట్టి, తెరాస శ్రేణులను నడిపించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత, హరీష్ రావు మరే ఇతర ఎన్నికల్లో ఆ స్థాయి బాధ్యతలు తీసుకోలేదు. ఇప్పుడు మరోసారి… రేవంత్ రెడ్డి పార్లమెంటు నియోజక వర్గంలో పార్టీ నడిపించే పనిలో పడ్డట్టు సమాచారం. కొడంగల్ లో ఎమ్మెల్యేగా ఓడిన రేవంత్ రెడ్డి… మల్కాజ్ గిరి నుంచి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా మల్కాగిరి, మేడ్చల్ పరిధిలోని 9 మున్సిపాలిటీలు, 4 కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్న పట్టుదలతో ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో కూడా మల్కాగిరిలో కాంగ్రెస్ పట్టు సాధిస్తే… భవిష్యత్తులో తమకు అవకాశం లేకుండా పోతుందనే అభిప్రాయం తెరాస వర్గాల్లో ఉంది. మేడ్చల్, కుకట్ పల్లి, కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజక వర్గాలపై కూడా ఈ గెలుపు ప్రభావం ఉంటుందని అంచనా వేస్తోంది. అందుకే ఇక్కడ మంత్రి హరీష్ రావుకి పార్టీ బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం.
లోక్ సభ ఎన్నికల్లో మంత్రి మల్లారెడ్డి మేనల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి గెలిచారు. కేసీఆర్ కి బద్ధ శత్రువుగా పేరుబడ్డ రేవంత్ గెలుపును తెరాస అప్పుడే జీర్ణించుకోలేకపోయింది. అప్పట్నుంచే మల్లారెడ్డి కూడా మల్కాగిరిలో పట్టువదలకూడదని గట్టి ప్రయత్నమే చేస్తూ వస్తున్నారు. అయితే, ఆశించిన స్థాయిలో తెరాసకు ఇక్కడ పట్టు చిక్కలేదనే చెప్పాలి. ఇంకోపక్క, మేడ్చల్ లో మల్లారెడ్డి, సుధీర్ రెడ్డిల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ పంచాయితీ సీఎం కేసీఆర్ వరకూ వెళ్లింది. విభేదాలన్నీ కాసేపు పక్కనపెట్టి మల్లారెడ్డితో కలిసి పనిచేయాలంటూ సుధీర్ రెడ్డిని కేసీఆర్ ఆదేశించారట. దీంతో ఇప్పుడు వీళ్లందర్నీ ఏకతాటిపైకి తీసుకొచ్చే పనిలో హరీష్ రావు ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే బోడుప్పల్, మేడ్చల్, జవహర్ నగర్ లో జరిగిన ప్రచార సభల్లో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈయనతోపాటు సబితారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డిలు కూడా పాల్గొన్నారు.
దీంతో రేవంత్ రెడ్డి పార్లమెంటు స్థానంలో మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ ని కట్టడి చేయడం ద్వారా రేవంత్ దూకుడుకి కళ్లెం వెయ్యొచ్చని తెరాస భావిస్తోంది. అధికార పార్టీ తల్చుకుంటే సామ దాన భేద దండోపాయాలకు కొదువ ఉండదు. అంగబలం అర్థబల ప్రదర్శనలు కూడా గట్టిగానే ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. తెరాస నుంచి రేవంత్ కి మరోసారి గట్టి సవాలే ఎదురు కాబోతోంది. కొడంగల్ తరహాలో ఇక్కడ కూడా హరీష్ మార్క్ వ్యూహం ఎంత వరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి.