సంక్షేమ పథకాలు ఎవరు అమలు చేస్తే ఏం..? కేంద్రం చేసినా, రాష్ట్రాలు చేసినా…. రాష్ట్రాల స్ఫూర్తితో కేంద్రం పథకాలు ప్రవేశపెట్టినా, కేంద్రం స్ఫూర్తితో రాష్ట్రాలు కొత్త పథకాలు తెచ్చినా… అంతిమంగా ప్రజల మేలు కోసమే కదా. పథకాల మీద కాపీ రైట్స్ లాంటివి ఉండవు కదా? కానీ, మా పథకాల్ని భాజపా కాపీ కొట్టేస్తోందీ, ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేసేస్తోంది, కేంద్రం కూడా మనల్ని కాపీ కొడుతోందని తెరాస నేతలు అంటుంటారు. ఈ మధ్య ఆ టాపిక్ కాస్త పక్కనపెట్టేరనుకుంటే… మళ్లీ అదే తరహా విమర్శలు చేశారు మంత్రి హరీష్ రావు. నిజానికి, ఆయన కూడా ఈ మధ్య విపక్ష పార్టీల మీద విమర్శలకి దూరంగా ఉంటున్నారు. భాజపా, కాంగ్రెస్ ల మీద విమర్శలంటే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మాత్రమే స్పందిస్తూ వస్తున్నారు. అయితే, ఈ మధ్య భాజపా మీద విమర్శల తీవ్రతను కేసీఆర్, కేటీఆర్ పెంచారు కదా! దానికి కొనసాగింపుగా హరీష్ రావు కూడా లైన్లోకి వచ్చినట్టున్నారు.
దేశానికి తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్ గా నిలుస్తోందనీ, భాజపా అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఇక్కడికి వచ్చిన అభివృద్ధిని తెలుసుకుంటున్నారన్నారు మంత్రి హరీష్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టువైపు దేశం చూస్తోందనీ, నీటి అవసరాలను తీర్చేందుకు మనం చేపడుతున్న మిషన్ భగీరథను ఇతర రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయన్నారు. షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి పథకాల ద్వారా ఆడబిడ్డల పెళ్లిళ్లు చేస్తున్నది ఒక్క తెరాస సర్కారు మాత్రమే అన్నారు. కేసీఆర్ కిట్లు తరహా పథకాలు ఎక్కడా లేవన్నారు. మన సంక్షేమ పథకాల్ని అధ్యయనం చేసి, భాజపా పాలిత రాష్ట్రాలు కాపీ కొడుతూ అమలు చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో భాజపాతోపాటు కాంగ్రెస్ కి కూడా స్థానం లేదనీ, ఆ రెండు పార్టీలు మాటలే తప్ప చేతల్లో ఏమీ చేసింది లేదని విమర్శించారు.
భాజపా మీద ఏదో ఒకరకంగా విమర్శల దాడి చెయ్యాలనేది తెరాస వ్యూహంగా ఈ మధ్య మారింది. అందుకే, ఏదో ఒక అంశాన్ని దొరకబుచ్చుకుని మరీ విమర్శలకు దిగుతున్నారు. తెరాస ప్రముఖ నేతల వైఖరి చూస్తుంటే.. భాజపా నుంచి గట్టిపోటీ తప్పదనే అంచనాకి వచ్చినట్టే ఉన్నారు. అదే వ్యూహమైతే ఇలాంటి విమర్శలు ఎంతవరకూ ఉపయోగపడతాయి..? రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వడం లేదంటూ, తెలంగాణ సంక్షేమ పథకాలను భాజపా పాలిత రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయనే విమర్శలకు ప్రజల స్పందన ఏముంటుంది..? రాష్ట్రంలో తెరాస చెయ్యాల్సినవి చేస్తోందా లేదా, రెండోసారి అధికారంలోకి వచ్చాక కొత్తగా ఏం సాధించారనేది కొలమానం అవుతుంది. పాలనలో అధికార పార్టీ వైఫల్యం ఇతర పార్టీలకు ఆస్కారాన్ని ఇస్తుంది. భాజపా బలపకుండా ఉండాలంటే.. ఇలాంటి విమర్శలు చాలనుకుంటే సరైన వ్యూహం కాదు. పాలనపై దృష్టి పెడితేనే అంతిమంగా ప్రజాదరణ.