తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోరు హోరాహోరీగా నడుస్తోంది. గెలుపెవరిదో.. ఎవరూ అంచనా వేయలేని పరిస్థితులు ఉన్నాయి. దీంతో పార్టీలన్నీ… తమకు ఎదురు గారి వీస్తోందన్న భావిస్తున్న నియోజకవర్గాలు, మరింత దృష్టి పెడితే గెలుచుకోగలమని భావిస్తున్న నియోజకవర్గాలపై దృష్టి పెట్టాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ 26 నియోజకవర్గాల విషయంలో పరిస్థితులు చేజారుతున్నాయన్న ఆందోళనలో ఉన్నారు. అందుకే.. ఆ 26 నియోజకవర్గాల బాధ్యతలను ఉన్న పళంగా.. ట్రబుల్ షూటర్ హరీష్‌రావు అప్పగించారు. అక్కడ ప్రచారం చేయడమే కాదు.. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులను సమన్వయం చేసి… పార్టీ అభ్యర్థిని గెలిపించేలా వాతావరణాన్ని మార్చాలని దిశానిర్దేశం చేశారు. ఇందు కోసం.. హరీష్ రావుకు ప్రత్యేకంగా హెలికాఫ్టర్ కూడా కేటాయించారు.
ఇప్పటి వరకూ టీఆర్ఎస్లో.. ఒక్క కేసీఆర్ మాత్రమే.. హెలికాఫ్టర్ ఉపయోగించి ప్రచారం చేస్తున్నారు. ఈ నియోజకవర్గాల్లో హరీష్ రావు.. ప్రచారం కూడా ప్రారంభించారు. రోడ్ షోలు సభలతో హరీష్ రావు విస్తృత ప్రచారం చేయనున్నారు. ఈ 26 అసెంబ్లీ సీట్లలో ఎక్కువ టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. నిజామాబాద్, వరంగల్, నల్లగొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఈ స్థానాలు ఉన్నాయి. మెదక్‌లోని పఠాన్ చెరులో కూడా.. పరిస్థితి చేయిదాటిపోతోందన్న భావన టీఆర్ఎస్లో ఉంది. దాన్ని కూడా.. ప్రత్యేకంగా డీల్ చేయాలని… హరీష్ రావుకు… టీఆర్ఎస్ అధినాయకత్వం సూచించింది.
ఈ ఇరవై ఆరు నియోజకవర్గాల్లో హరీష్ రావు తన మార్క్ ఆపరేషన్ ను ప్రారంభించారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో పరిస్థితులను చక్క బెట్టేందుకు.. కొన్ని ఏర్పాట్లు చేశారు. రోడ్ షోలు నిర్వహించారు. ఇతర పార్టీల నేతల్ని ఆకట్టుకునేందుకు… పోలింగ్ సమయంలో… వారి వర్గం మొత్తం… కారు గుర్తుకు ఓటేసేలా చేసేందుకు తెర వెనుక వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. తనకు బాధ్యతలు అప్పగించిన ప్రతీ సందర్భంలోనూ.. హరీష్ రావు తన పని తనం చూపించారు. ఇప్పుడు అధికారంలోకి తేవడమో.. దూరం చేయడమో చేసే.. 26 నియోజకవర్గా బాధ్యతలను తీసుకున్నారు. అంటే… టీఆర్ఎస్ గెలుపోటముల్ని ఓ రకంగా హరీష్ తన చేతుల్లోకి తీసుకున్నారన్నమాట..!