లోక్‌సభ ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర సమితికి ఓ రకంగా షాక్ ఇచ్చినట్లయింది. పదహారు గెలుచుకుంటారనుకుంటే… కేవలం తొమ్మిదికే పరిమితం కావాల్సి వచ్చింది. దీనంతటికి కారణం… హరీష్‌కు ప్రాధాన్యత ఇవ్వకపోవడమేనన్న చర్చ జోరుగా నడుస్తోంది. అంతే కాదు.. కేబినెట్ విస్తరణలో కొంత మందికి పదవులు ఊడిపోతాయని… మరికొంత మందికి చాన్స్ వస్తుందని చెబుతున్నారు. ఈ కోణంలో.. హరీష్ రావు పేరు ప్రధానంగా వినిపిస్తోంది.
ఎవరికీ కాని వ్యక్తిగా టీఆర్ఎస్లో హరీష్ రావు.. !
తెలంగాణ రాష్ట్ర సమితిలో అత్యంత ప్రభావవంతమైన వ్యూహకర్తగా పేరున్న హరీష్ రావును ఇటీవలి కాలంలో… పక్కకు పెడుతూ వస్తున్నారు. కేటీఆర్‌కు పట్టాభిషేకం చేయాలంటే… హరీష్‌రావును పక్కన పెట్టాల్సిందేనని హైకమాండ్ భావించడంతో.. ఈ పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. అప్పట్నుంచి … హరీష్ రావు.. తన నియోజకవర్గం సిద్ధిపేటకే పరిమితం అయ్యారు. మంత్రివర్గంలో కూడా చోటు లేకపోవడంతో పరిస్థితి మారిపోయింది. ప్రాజెక్టులు సహా.. ఏ ఇతర కార్యక్రమం చేపట్టినా.. హరీష్ రావు ఊసే లేకుండా సాగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. కేటీఆర్ బాధ్యత తీసుకుని.. సారు – కారు – పదహారు అంటూ… ప్రచారం చేశారు. కానీ కంచుకోటల్లోనే ఓడిపోయారు.
పార్లమెంట్ షాక్‌తో.. మళ్లీ ప్రాధాన్యత కల్పిస్తారా..?
కార్యకర్తల సన్నాహక సమావేశంలో మెదక్ ఎంపీ స్థానంలో ఐదు లక్షల మెజారిటీ తీసుకు వస్తామని హరీష్ రావు ప్రకటించారు. ఈ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. మెదక్ ఎంపీ స్థానం కంటే రెండు ఓట్లు ఎక్కువ తీసుకువస్తామని హరీష్ రావుకు కేటీఆర్ సవాల్ విసిరారు. సరదాగానే ఈ సవాల్ సాగినా.. ఎన్నికల ఫలితాల తర్వాత ఇప్పుడు ఇది మరోసారి చర్చకు దారి తీస్తోంది. ఈ సవాల్లో కేటీఆర్ ఓడిపోయారు. మెజారిటీ సంగతి పక్కన పెడితే.. కరీంనగర్లో టీఆర్ఎస్ అభ్యర్ధికి చేదు అనుభవం ఎదురైంది. ఐతే అటు మెదక్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి మాత్రం భారీ మెజారిటీతో విజయం సాధించారు. అయితే.. హరీష్ చెప్పినట్లు ఐదు లక్షల మెజార్టీ రాలేదు. కానీ ఓడిపోవడం కంటే.. గెలుపు ముఖ్యమైనది కదా అనే చర్చ టీఆర్ఎస్లో పెరుగుతోంది.
కేసీఆర్ ఆలోచన ఎలా ఉంటుందో..?
ఇప్పటికిప్పుడు… ఎన్నికలు ఏమీ దగ్గర్లో లేవు. స్థానిక సంస్థల ఎన్నికలన్నీ పూర్తయిపోయాయి. మున్సిపల్ ఎన్నికలు మాత్రం జరగాల్సి ఉంది. ఈ తరుణంలో ఇక రాజకీయం కాకుండా.. పాలనపై దృష్టి పెట్టాలని టీఆర్ఎస్ అధినేత భావించే అవకాశం ఉంది. ఈ తరుణంలో… హరష్ ను కూడా మంత్రివర్గంలోకి తీసుకుంటారని… చెబుతున్నారు. అలా అయితే.. టీఆర్ఎస్ క్యాడర్లో… అసంతృప్తి తగ్గుతుందని అంటున్నారు. కేసీఆర్ ఇలా ఆలోచిస్తే సరే.. లేకపోతే మాత్రం… హరీష్ రావు.. నియోజకవర్గానికే పరిమితమయ్యే అవకాశం ఉంది.