తెలంగాణ రాజకీయాల్లో… ఓ సంచలనం ఖాయంగా కనిపిస్తోంది. ఆ సంచలనం హరీష్ రావేనన్న అంచనాలు కూడా వచ్చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితిలో ఆయనకు దక్కుతున్న అగౌరవంతో.. ఆయనపై సానుభూతి వెల్లువలా పెరిగిపోతోంది. ఎప్పుడైనా.. ఎక్కడైనా.. అన్యాయం జరిగిందని భావించిన వారికే.., ప్రజల మద్దతు ఏకపక్షంగా ఉంటుందనే సంగతి అనేక సార్లు రుజువు అయింది. ఇప్పుడు హరీష్‌రావుకు… టీఆర్ఎస్లో ఇక ఏ మాత్రం ప్రాధాన్యం దక్కే సూచనలు లేవు కాబట్టి.. ఇప్పుడు కాకపోతే.. మరో రెండేళ్లకయినా ఆయన సొంత పార్టీ పెట్టుకుంటారన్న ప్రచారం.. ఉద్ధృతంగా ప్రారంభమయింది. దీనికి ఆజ్యం కేసీఆరే పోశారు.
తెలంగాణలో రెండూ ప్రాంతీయ పార్టీలే ఉండాలంటున్న కేసీఆర్..!
కేసీఆర్ కొద్ది రోజుల కిందట.. పార్టీ కార్యవర్గ సమావేశం పెట్టారు. అందులో…, తమిళనాడు రాజకీయాలను ప్రస్తావించారు. అక్కడ జాతీయ పార్టీలకు తావు లేదని… ద్రవిడ పార్టీలను మాత్రమే ప్రజలు ఆదరిస్తారని… ప్రతిపక్షం, అధికారపక్షం రెండూ.. ద్రవిడ పార్టీలే ఉంటాయన్నారు. అలాంటి పరిస్థితి తెలంగాణలో ఉండాలన్నట్లుగామాట్లాడారు. అప్పుడు… పార్టీ పటిష్టత గురించి.. కేసీఆర్ మాట్లాడారని అనుకున్నారు కానీ.. అసలు విషయం మాత్రం.. తమిళనాడు ద్రవిడ పార్టీల్లా … తెలంగాణలో.. తెలంగాణ వాద పార్టీలు ఉండాలనేది.. కేసీఆర్ ఉద్దేశమంటున్నారు. మొదటి తెలంగాణ వాద పార్టీ.. టీఆర్ఎస్ అయితే.. రెండో తెలంగాణ వాద పార్టీ ఏదీ.. అనేది చాలా మందికి సందేహం కలిగిన అంశం. దానికి సమాధానమే.. హరీష్ రావు. హరీష్ రావు సొంత పార్టీవైపు కసరత్తు చేసుకుంటున్నారన్న సమాచారంతోనే… కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా.. టీఆర్ఎస్ వర్గాల్లోకి జోరుగా వెళ్లిపోయింది.
రెండో ప్రాంతీయ పార్టీ హరీష్‌రావు పెట్టబోయేదేనా..?
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్… హరీష్ పార్టీ పెట్టుకుంటారన్నట్లుగా…. పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు.. వ్యూహాత్మకంగా చేశారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొద్ది రోజులుగా.. ఆయన.. హరీష్‌రావుకు అసలు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. పార్టీ పదవులు ఇవ్వలేదు. మంత్రి పదవి ఇవ్వలేదు. చివరికి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓపెనింగ్‌కూ పిలువలేదు. పార్టీలో ఆయనను నిరాదరణకు గురి చేస్తున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో.. ఆయనపై మరింత కఠినంగా వ్యవహరిస్తే… ప్రజల్లో మరింత సానుభూతి పెరుగుతుందని అనుకుంటున్నారు. అలా సానుభూతి పెంచాలని కూడా కేసీఆర్ అనుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. పోటీ అంటూ జరిగితే.. అది తమ కుటుంబం మధ్యనే ఉంటుందని.. అధికారం కూడా.. తమ కుటుంబం చేతుల్లోనే ఉంటుందని.. కేసీఆర్ భావిస్తున్నట్లు.. కొన్ని వర్గాలు అంచనా వేస్తున్నాయి.
జాతీయ పార్టీల వైపు హరీష్ చూసే అవకాశం లేదా..?
హరీష్‌రావు.. ఆలోచనలేమిటో స్పష్టం కాలేదు కానీ… ఆయన సొంత పార్టీ పెట్టుకున్నా పర్వాలేదు కానీ.. ఇతర జాతీయ పార్టీల్లో చేరవద్దన్న సంకేతాన్ని కేసీఆర్ .. రాష్ట్ర కార్యవర్గ సమావేశం ద్వారా పంపారన్న అభిప్రాయం మాత్రం వ్యక్తమవుతోంది. హరీష్ కూడా అదే ఆలోచనతో ఉన్నారని.. టీఆర్ఎస్లో గుసగుసలు ప్రారంభమయ్యాయి. బీజేపీ, కాంగ్రెస్‌లు.. హరీష్ వస్తే.. నెత్తిమీద పెట్టుకోవడానికి రెడీగా ఉన్నాయి. కానీ ఆయన మాత్రం.. మామ ఆలోచనలకు అనుగుణంగా… వచ్చే ఎన్నికల నాటికైనా.. బరిలో ఉండేలా.. సొంత పార్టీకి రూపకల్పన చేసే అవకాశం కనిపిస్తోంది.