ఉమ్మడి మెదక్ జిల్లా టీఆర్ఎస్కు కంచుకోట లాంటిది. అదీ కూడా.. గజ్వేల్, సిద్దిపేట పక్కన ఉండే దుబ్బాక అంటే.. ఆయా నియోజకవర్గాల స్థాయి మెజార్టీలు వస్తూంటాయి. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో సోలిపేట రామలింగారెడ్డికి వచ్చిన మెజార్టీ అక్షరాలా అరవై ఐదు వేలు. అలాంటి టీఆర్ఎస్ కంచుకోటను రఘునందన్ రావు బద్దలు కొట్టారు. సాధారణంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎలాంటి ఎన్నికలు వచ్చినా బాధ్యత హరీష్ రావే తీసుకుంటారు. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ సీనియర్ల ఓటమికి తానే వ్యూహం పన్నారు. సక్సెస్ అయ్యారు. అలాగే ఇప్పుడు.. దుబ్బాక టీఆర్ఎస్ బాధ్యతలన్నింటినీ హరీష్తన భుజంపై వేసుకున్నారు. అన్నీ తానై నడిపించారు.
తానే అభ్యర్థి అనుకుని ఓటేయండి అంటూ విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్ వైపు నుంచి హైకమాండ్ కూడా పూర్తి స్వేచ్చ ఇచ్చింది. కేటీఆర్ కానీ.. కేసీఆర్ కానీ పెద్దగా దృష్టి పెట్టలేదు. ఈ కారణంగా బాధ్యత కూడా ఆయనదే అయింది. దుబ్బాక ఓటమికి తనదే బాధ్యతని హరీష్ రావు ప్రకటించారు. ప్రజా తీర్పును శిరసావహిస్తానని చెప్పారు. ఇప్పుడు హరీష్ పరిస్థితేమిటన్న చర్చ టీఆర్ఎస్లో జరుగుతోంది. బయటకు చెప్పకపోయినా .. హరీష్ ప్రాధాన్యం తగ్గించే దిశగా కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో ఉంది. కుమారుడు కేటీఆర్‌కు పట్టం కట్టడానికి… హరీష్ విషయంలో జాగ్రత్తగా ఉంటున్నారని అంటున్నారు.
తనను పార్టీలో దూరం పెడుతున్నారన్న సూచనలు వచ్చినా హరీశ్ రావు ఎక్కడా అసంతృప్తిని బాహాటంగా వ్యక్తం చేయలేదు. కానీ పార్టీలో తన ప్రాధాన్యాన్ని చాటి చెప్పే అవకాశం వస్తే ఎప్పుడూ వదిలి పెట్టలేదు.. దుబ్బాకలో బంపర్ మెజారిటీతో గెలిచి…. తన ఉనికిని పార్టీలో మరోసారి చాటుదామనుకున్న హరీశ్‌కు దుబ్బాక ఫలితం దెబ్బకొట్టింది. ఇప్పుడు పార్టీలో కేటీఆర్ మరింత బలం పుంజుకున్నారు. ఓటమికి మంత్రుల్నే బాధ్యత చేస్తానని కేసీఆర్ గతంలో ప్రకటించారు. దాని ప్రకారం.. ఇప్పుడు హరీష్ రావు మంత్రి పదవి కూడా ఊస్టింగ్ ఖాయమన్న ఉహాగానాలు ప్రారంభమయ్యాయి. ఏదైనా.. టీఆర్ఎస్లో ఇక హరీష్ రావుకు.. ప్రత్యక్ష గడ్డు కాలం ప్రారంభమైందన్న చర్చ మాత్రం ప్రారంభమయింది.