మాజీ మంత్రి హరీష్ రావు తను విసిరిన సవాల్ పై యూటర్న్ తీసుకున్నారు. సీఎం రేవంత్ చెప్పినట్లుగా గడువులోగా రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఛాలెంజ్ విసిరి ఇప్పుడు తోక ముడిచారు. తాను కేవలం రుణమాఫీ గురించి మాత్రమే సవాల్ చేయలేదంటూ ప్రకటించి ఊసురుమనిపించారు.
రుణమాఫీ నేటి నుంచి ప్రారంభం కావడంతో హరీష్ రావును టార్గెట్ చేయడానికి కాంగ్రెస్ బెటాలియన్ మొత్తం సిద్ధమైంది. మంత్రులు, ఎమ్మెల్యేలు సహా నేతలంతా హరీష్ రావు రాజీనామాకు వేళైంది అంటూ ఆయనను డిఫెన్స్ లో పడేసేందుకు రెడీ అయ్యారు. ఈ ఉక్కపోతను ముందే ఊహించిన హరీష్.. తనే స్వయంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన రాజీనామాపై క్లారిటీ ఇచ్చారు.
తాను ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేస్తే రాజీనామా చేస్తానని చెప్పినట్లుగా నాలుక మడతేశారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో రెండు లక్షల రుణాలను మాఫీ చేస్తానని రేవంత్ భద్రాద్రి రామయ్య సాక్షిగా హామీ ఇవ్వడంతో.. హరీష్ రైతుల ఓటు బ్యాంక్ చేజారిపోకుండా ఉండేలా రేవంత్ కు సవాల్ చేశారు. ఆగస్ట్ 15 లోపు రేవంత్ రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ ఛాలెంజ్ చేశారు. రాజీనామాకు సిద్దంగా ఉండు హరీష్ అంటూ అప్పట్లోనే రేవంత్ స్పష్టం చేశారు.
గురువారం నుంచి రుణమాఫీ మొదలు కావడంతో హరీష్ రావు రాజీనామాపై చర్చ ప్రారంభం కాగా… తాను అలా అనలేదని… ఆరు గ్యారంటీల విషయాన్ని దృష్టిలో ఉంచుకొని రాజీనామా అంశాన్ని లేవనెత్తాను అంటూ తన మ్యానరిజాన్ని ప్రదర్శించారు.