తెలంగాణ రాష్ట్ర సమితి నేత హరీష్ రావు.. రాజకీయంగా ఒత్తిడిలో ఉన్నారు. ఓ వైపు.. పార్టీలో ప్రాధాన్యం అంతకంతకూ తగ్గిపోతోంది. అదే సమయంలో.. ఆయనను టీఆర్ఎస్కు వ్యతిరేకంగా చేసేందుకు చాలా మంది అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. హరీష్ రావు ఏం మాట్లాడినా… ఏం చేసినా.. దానికి డబుల్ మీనింగ్లు తీసుకుని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తన రాజకీయ కార్యకలాపాల్ని కత్తి మీద సాములా నిర్వహిస్తున్నారు.
పుట్టినరోజు నాడు ఆజ్ఞాతంలోకి హరీష్..!
టీఆర్ఎస్లో హరీష్‌రావుకు సింపతీ ఉంది. ఆయనకు అన్యాయం జరిగిందనే భావన ఉంది. అందుకే పార్టీ నేతలు ఆయనతో చాలా మంది.. టచ్‌లో ఉంటారు. కానీ అది బహిరంగంగా కాదు. అంతర్గతంగా మాత్రం.. హరీష్‌పై ఎక్కడ లేని అభిమానం ప్రదర్శిస్తూ ఉంటారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో.. హరీష్‌కు మద్దతు అంతకంతకూ పెరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్కు షాకులు తలగడంతో… మళ్లీ హరీష్‌కు ప్రాధాన్యం పెరుగుతుందన్న చర్చ వచ్చేసింది. అదే సమయంలో… హరీష్ రావు పుట్టిన రోజు వచ్చింది. తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నేతలు.. హరీష్ రావు ఇంటికి వచ్చి శుభాకాంక్షలు చెబుతారన్న ప్రచారం జరిగింది. దాంతో.. హరీష్ రావు… తాను హైదరాబాద్‌లో కానీ.. సిద్ధిపేటలో కానీ ఉండబోవడం లేదని… ఎక్కడుంటోనని ఎవరికీ తెలియదని ప్రకటించి.. అనుకున్నట్లుగానే ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
బలప్రదర్శనగా ప్రచారం జరుగుతుందన్న ఆందోళనతోనే..!
సాధారణంగా హరీష్ రావు ప్రజల మనిషి. దాంతో ఆయనకు శుభాకాంక్షలు చెప్పేందుకు ఎక్కడ ఉన్నా.. పెద్ద ఎత్తున జనం తరలి వస్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో రెండో సారి విజయం సాధించిన తర్వాత ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం లేదని ప్రచారం జరుగుతున్న సమయంలో.. మినిస్టర్ క్వార్టర్స్‌లోని ఆయన ఇంటికి రోజూ.. వందల మంది నేతలు వచ్చి పోయేవారు. ఇప్పుడు పుట్టిన రోజు అంటే.. అంతకు మించి హంగామా చేస్తారు. ఇది ఓ రకంగా… హరీష్ రావు బల ప్రదర్శనగా.. ప్రచారం జరుగుతుందనే ఆందోళనతోనే.. హరీష్ రావు… సిటీలో లేకుండా వెళ్లారని చెబుతున్నారు.
మంత్రి పదవి వచ్చినా .. రాకపోయినా హరీష్ అంతే..!
బయట ప్రచారం జరుగుతున్నట్లుగా హరీష్ రావు ఎంత మాత్రం అసంతృప్తితో లేరని.. ఆయ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. విస్తరణలో మంత్రి పదవి వచ్చినా రాకపోయినా.. ఆయన విధేయతలో ఎలాంటి మార్పు ఉండబోదని అంటున్నారు. తనకు అన్యాయం జరిగిందని జాలి చూపించి.. తనను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్న విషయాన్ని ఆయన అవగాహనలో ఉంచుకుంటున్నారని… అలాంటి ట్రాప్‌లో పడబోరని అంటున్నారు. టీఆర్ఎస్ అగ్రనేతలు కూడా .. అదే ధీమాలో ఉన్నారు.