తెలంగాణా ప్రాజెక్టులని వ్యతిరేకిస్తూ కర్నూలులో జగన్ చేస్తున్న నిరాహార దీక్ష నేడు రెండవ రోజుకి చేరుకొంది. ఊహించినట్లుగానే జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చాలా తీవ్ర విమర్శలు చేసారు. కానీ ఈసారి ఊహించని విధంగా ఆయన తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ పై కూడా చాలా ఘాటుగా విమర్శలు చేసారు. దానితో అటు నుంచి మంత్రి హరీష్ రావు కూడా అంతే ఘాటుగా స్పందిస్తూ ‘జగన్ ఆర్ధిక నేరస్తుడు..మా ప్రాజెక్టుల జోలికి వస్తే మానుకోట రైల్వే స్టేషన్ లో తరిమికొట్టినట్లు తెలంగాణా నుంచి తరిమికొడతామని’ హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు, జగన్ ఇద్దరూ తెలంగాణా ప్రాజెక్టులు అడ్డుకోవడానికి కుట్రలు పన్నుతున్నారని, కానీ ఎంతమంది వచ్చినా ప్రాజెక్టులు ఆపలేరని అన్నారు. తెలంగాణాలో కోటి ఎకరాలకు నీళ్ళు పారించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, డానికి ఎవరు అడ్డు వచ్చినా సహించేది లేదని హెచ్చరించారు. రాజకీయ, న్యాయపరమైన సమస్యలలో చిక్కుకొన్న జగన్ తన అస్తిత్వాన్ని కాపాడుకొనేందుకే దొంగ దీక్షలు చేస్తున్నారని హరీష్ రావు విమర్శించారు.
బహుశః ఈ పరస్పర విమర్శల పర్వం మరో మూడు రోజులు ఇదేవిధంగా కొనసాగవచ్చు. ఆ తరువాత వేరే మరో అంశమేదో ముందుకు రాగానే, ఈ సమస్యను పక్కన పడేసి దాని వైపు మళ్ళవచ్చు. కానీ జగన్ లేవనెత్తిన నీటి సమస్య మాత్రం పరిష్కారం కాదని అందరికీ తెలుసు. ఎందుకంటే, ఆ ప్రాజెక్టులను ఎవరూ ఆపలేరని, ఆపితే ఊరుకోమని మంత్రి హరీష్ రావు చాలా స్పష్టంగా చెపుతున్నారు. సున్నితమైన ఈ సమస్యను చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకోకుండా ఒకరినొకరు విమర్శించుకొంటూ, కబడ్ధార్! అంటూ బెదిరించుకొంటూ రెండు రాష్ట్రాల ప్రజలలో మళ్ళీ భావోద్వేగాలు రెచ్చ గొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అది చివరకి ఏవిధంగా ముగుస్తుందో, దాని పరిణామాలు ఏవిధంగా ఉంటాయో ఎవరూ ఊహించలేరు.
అన్నదమ్ములలాగ ఒకరికొకరు సహకరించుకొంటూ కలిసిమెలిసి మెలగవలసిన రెండు తెలుగు రాష్ట్రాలు ఈవిధంగా ఆగర్భ శత్రువులలాగ కీచులాడుకొంటుంటే, వాటిని గాడిన పెట్టవలసిన కేంద్ర ప్రభుత్వం వాటితో తనకు సంబంధమే లేదన్నట్లుగా చోద్యం చూస్తోంది. ఇప్పటికయినా ఈ నీటి సమస్యలపై కేంద్రం స్పందించి తగిన చర్యలు చేపట్టకపోతే, ఆ తరువాత పరిస్థితులను అదుపు చేయడం దాని వల్ల కూడా కాకపోవచ్చు.