” నిద్రపోతున్నా కాళేశ్వరం… మేలుకున్నా కాళేశ్వరం.. తింటున్నా కాళేశ్వరం… అందుకే.. ఈయన పేరు ఇక నుంచి హరీష్ రావు అని కాకుండా.. కాళేశ్వరరావు అని పిలిస్తే బాగుంటుంది..”
ఈ మాట అన్నది .. అలా పొగడాల్సిన అవసరం కానీ..మొహర్బానీ చేయాల్సిన అవసరం కానీ ఏ మాత్రం లేని… గవర్నర్ నరసింహన్. టీఆర్ఎస్ మొదటి ప్రభుత్వంలో.. హరీష్ చేతుల మీదుగా కాళేశ్వరం పనులను పరిశీలించిన తర్వాత అబ్బురపడిన గవర్నర్ ఈ మాట అన్నారు. ఇందులో అతిశయోక్తి లేదు. ఎందుకంటే.. కేసీఆర్ ఎప్పుడైతే.. రీడిజైన్ ఆలోచన చేశారో.. అప్పట్నుంచి ప్రతి అడుగులోనూ.. హరీష్ రావు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే.. కేసీఆర్‌ది ఆలోచన మాత్రమే.. కార్యక్షేత్రంలో ఆచరణ హరీష్‌రావుది. ఆ విషయం స్పష్టంగా తెలుసుకాబట్టే.. గవర్నర్ ఆ కితాబిచ్చారు.
హరీష్ కోసం వెదికిన కళ్లెన్నో..!
కానీ ఇప్పుడా కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో ఆ కాళేశ్వరరావు అలియాస్ హరీష్ రావు కనిపించలేదు. ఆయనకు అధికారికంగా ఆహ్వానం లేదు. పిలవకుండా.. ఆయన వెళ్లలేరు. అందుకే.. అక్కడ ఆయన కనిపించలేదు. కానీ.. అక్కడ ప్రతి నిర్మాణంలోనూ.. ప్రతి బ్యాలేజీలోనూ.. ప్రతి పంప్ హౌస్‌లోనూ.. ఆయన ముద్ర ఉందన్న అభిప్రాయం.. గుసగుసల రూపంలో వినిపించింది. అందులో రహస్యం ఏమీ లేదు. కాళేశ్వరం కోసం పని చేసిన ఇంజినీర్లు.. వర్కర్లు.. ప్రతీ ఒక్కరూ హరీష్‌రావును గుర్తు చేసుకున్నారు. కాళేశ్వరరావు కూడా.. వారి కళ్లు వెదికాయి. కానీ.. కనిపించలేదు.
కష్టపడినోళ్లకు ఆహ్వానం లేదు.. వద్దని దీక్ష చేసినోళ్లకు రెడ్ కార్పెట్..!
కాళేశ్వరం ప్రాజెక్ట్ వద్ద.. హరీష్ రావు కనిపించలేదు కానీ.. వైసీపీ అధినేత మాత్రం చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. దీనిపై వెంటనే సెటైర్లు కూడా పడ్డాయి. కాళేశ్వరం కోసం రాత్రింబవళ్లు కష్టపడిన హరీష్‌రావును.. కేసీఆర్ మర్చిపోయారు కానీ.. అదే ప్రాజెక్ట్ వద్దని దీక్షలు చేసిన.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని రెడ్ కార్పెట్ వేసి.. ఆహ్వానించడమే కాకుండా.. శిలాఫలకంపై.. పేరు చెక్కించి మరీ.. గౌరవించడాన్ని… సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ అయింది.
హరీష్‌రావుకు ఒక్క సారిగా పెరిగిన సానుభూతి..!
కాళేశ్వరం విషయంలో.. హరీష్‌రావుకు… తీవ్ర అవమానం జరిగిందన్న అభిప్రాయం.. తెలంగాణ మొత్తం ఏర్పడింది. సోషల్ మీడియాలో ఆయన పేరుతో.. ఏర్పాటైన.. అనేక గ్రూపులు.. కాళేశ్వరం సందర్భంగా.. హరీష్‌రావునే ఎక్కువగా గుర్తు చేసుకున్నాయి. ప్రాజెక్ట్ కోసం.. హరీష్ పడిన కష్టాన్ని గుర్తు చేశాయి. ఈ పరిణామాలతో.. హరీష్పైఒక్క సారిగా సానుభూతి పెరిగిపోయింది. ప్రాజెక్ట్ కోసం… ఇంత కష్టపడిన హరీష్‌రావుకు కనీసం గౌరవం ఇవ్వలేదన్న ఆవేదన.. టీఆర్ఎస్లోని ఓ వర్గంలో కూడా ప్రారంభమయింది.