తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి భారత రాజ్యాంగం వర్తించదా…? రాహుల్ గాంధీ చేతిలో పట్టుకొని తిరుగుతున్న రాజ్యాంగం తెలంగాణలో చెల్లదా…? కేసీ వేణుగోపాల్ కు ఒక రూల్… మాకో రూల్ ఎందుకు? అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. రేవంత్ సర్కార్ పై రాహుల్ కు ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు.
తెలంగాణలో ప్రజా పద్దుల కమిటీ, పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ, ఎస్టిమేట్ కమిటీల ప్రకటన ఎందుకు ఆలస్యం అవుతోంది? అసెంబ్లీ ముగిసి 38 రోజులు అవుతున్నా ఎందుకు ప్రకటన రావటం లేదని హరీష్ రావు ప్రశ్నించారు. పార్లమెంట్ లో కేసీ వేణుగోపాల్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా ఉన్నారు… మరి ఇక్కడ ఎందుకు ఆ ప్రక్రియ ఆలస్యం చేస్తున్నారన్నారు.
మండలిలో ప్రతిపక్ష నేతగా మధుసూదనాచారిని పరిగణించాలని తమ పార్టీ అధికారికంగా లెటర్ ఇచ్చింది. 40 రోజులు అవుతున్నా దాన్ని పట్టించుకోవటం లేదు. చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్న రాహుల్ గాంధీ గారినే అడుగుతా… మీ ప్రభుత్వానికి, తెలంగాణ కాంగ్రెస్ కు ఈ దేశ రాజ్యాంగం వర్తించదా అని హరీష్ రావు మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే జాప్యం చేస్తోంది, చదువుకున్న వ్యక్తి… పైగా అనుభవజ్ఞుడైన శ్రీధర్ బాబు మంత్రిగా ఉన్నారు. అయినా పని కావటం లేదు కాబట్టి ట్విట్టర్ ద్వారా రాహుల్ గాంధీకి స్వయంగా ఫిర్యాదు చేస్తానని హరీష్ రావు ప్రకటించారు.