కాళేశ్వరం ప్రాజెక్ట్ను తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. దాదాపుగా రూ.81 వేల కోట్ల రూపాయల వ్యయం చేస్తున్నారు. “తెలంగాణ..కోటి ఎకరాల మాగాణ” లక్ష్యాన్నిఈ ప్రాజెక్ట్ ద్వారా సాకారం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్, నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు దాదాపుగా ప్రతీ రోజూ చెబుతూంటారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి పెట్టుకున్న డెడ్ లైన్ ఈ ఏడాది ఆఖరే. కానీ పనులు మాత్రం అనుకున్నంత వేగంగా సాగడం లేదు. నిన్నామొన్నటి వరకూ… పనుల పురోగతిపైనే తరచూ మీడియా సమావేశాలు పెట్టే హరీష్ రావు ఇప్పుడు రూటు మార్చారు. ప్రెస్ మీట్లు పెడుతున్నారు.. సందర్భం వచ్చినప్పుడల్లా ప్రస్తావిస్తున్నారు…కాకపోతే కాళేశ్వరం పనులపై కాదు. ఆ పనులను అడ్డుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపణలు చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ ను… తెలుగుదేశం పార్ట అధినేత చంద్రబాబునాయుడు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని.. హరీష్ రావు గత రెండు వారాలుగా ఆరోపిస్తున్నారు. చంద్రబాబు ఎప్పుడు ఫిర్యాదు చేశారో.. ఏమని ఫిర్యాదు చేశారో మాత్రం బయటపెట్టలేదు. మారుతున్న రాజకీయ పరిస్థితులతో ఇప్పుడు …టీడీపీ, కాంగ్రెస్ లు కలిసి కాళేశ్వరం ప్రాజెక్ట్ ను అడ్డుకుంటున్నాయని ఆరోపించడం ప్రారంభించారు. ఏపీకి ఏదో లాభం జరుగుతుందని చంద్రబాబు కాళేశ్వరాన్ని అడ్డుకుంటున్నారని చెప్పుకొస్తున్నారు ప్రత్యేకంగా కాళేశ్వరంపై అటు టీడీపీ కానీ.. ఇటు కాంగ్రెస్ కానీ ఇప్పటికప్పుడు ప్రత్యేకంగా చేపట్టిన కార్యాచరణ ఏమీ లేకపోయినా.. కేసీఆర్ ఎందుకు ఆరోపణలు చేస్తున్నారన్న సందేహానికి నిన్న రాజ్యసభలో కేంద్రమంత్రి మేఘవాల్ ఇచ్చిన సమాధానం క్లారిటీ ఇస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా కోసం ప్రయత్నిస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం చాలా రోజులుగా చెబుతోంది. అనేక సార్లు విజ్ఞప్తులు చేసినట్లు చెప్పుకుంది. వాస్తవంలో మాత్రం… తెలంగాణ నుంచి ఇంత వరకూ ఒక్క ప్రతిపాదన కూడా కేంద్రానికి వెళ్లలేదు. ఈ విషయాన్ని రాజ్యసభలో.. స్ఫష్టంగా చెప్పారు కేంద్రమంత్రి.
కాళేశ్వరం ప్రాజెక్టులో అనేక అవకతవకలున్నాయని.. జాతీయ హోదా అడిగితే.. కేంద్రానికి అన్ని వివరాలు ఇవ్వాల్సి వస్తుందని.. తెలంగాణ ప్రభుత్వం.. జాతీయహోదా అడగకుండా వెనుకడుగు వేస్తోందన్న ఆరోపణలు చాలా రోజుల నుంచి ఉన్నాయి. ఈ విషయం వివాదాస్పదం అవకుండా.. ఎవరూ విమర్శలు ప్రారంభించకుండా ముందుగానే హరీష్ రావు… ఈ విమర్శలు ప్రారంభించినట్లు అనుమానిస్తున్నారు. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే.. దిగువ రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్ లో కడుతున్న ప్రాజెక్టులపై తెలంగాణ ఫిర్యాదులు చేయడం. పురుషోత్తపట్నం ప్రాజెక్టు నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని… ఎన్జీటీలో తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. పురుషోత్తపట్నం ప్రాజెక్టు అక్రమంగా నిర్మిస్తున్నారనేది తెలంగాణ ప్రభుత్వ వాదన. దిగువకు..సముద్రంలోకి వృథాగా పోయే నీటిని ఉత్తరాంధ్రకు అందించడానికి.. పోలవరం కాలువలను ఉపయోగించుకుంటూ చేపట్టిన ప్రాజెక్ట్ అది. దాని వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం రాదు.అయినా సరే ప్రాజెక్ట్ నిలిపివేయాలని ఎన్జీటీకి వెళ్లారు. రివర్స్ లో కాళేశ్వరం ప్రాజెక్ట్ ను నిలిపివేయడానకికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. మొగుడ్ని కొట్టి మొగసాలకు ఎక్కడం అంటే ఇది కాదా..!?