బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక అటు కేసీఆర్, ఇటు హరీష్ రావు రాజకీయ వ్యూహాలు తేలిపోతున్నాయి. ప్రత్యర్ధులను కట్టడి చేసేందుకు చేస్తోన్న వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు మేలు చేయకపోగా…అధికార కాంగ్రెస్ కు ఫేవర్ చేసేలా ఉన్నాయన్న చర్చ జరుగుతోంది.
రైతు రుణమాఫీపై మాజీ మంత్రి హరీష్ రావు తగ్గేదేలే అంటూ వరుసగా సవాళ్ళు విరురుతున్నారు. పంద్రాగస్ట్ లోపు రుణమాఫీ చేయకపోతే పదవికి రాజీనామా చేస్తావా అని హరీష్ రావు విసిరిన సవాల్ కు ధీటుగా సీఎం రేవంత్ రెడ్డి జవాబిచ్చారు. డెడ్ లైన్ లోపే రుణమాఫీ చేసి చూపిస్తా.. అలా చేస్తే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తావా.. నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు రెడీగా అంటూ హరీష్ కు ప్రతి సవాల్ చేశారు. దీంతో తాను రాజీనామా లేఖతో అమరవీరుల స్థూపం వద్దకు వస్తా.. రేవంత్ నువ్వు కూడా వస్తవా అంటూ హరీష్ ఛాలెంజ్ చేశారు.
రుణమాఫీపై ఎంత చర్చ జరిగితే కాంగ్రెస్ కు అంత మేలు జరుగుతుందని సీఎం రేవంత్ భావిస్తున్నారు. దీనిని ఏమాత్రం అంచనా వేయకుండా వరుస సవాళ్ళతో హరీష్ రావు రుణమాఫీపై ఎక్కువ చర్చ జరిగేందుకు కారణం అవుతున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. హరీష్ రావు రోజుకో సవాల్ పేరుతో రాజకీయం చేస్తే అది కాంగ్రెస్ కే మేలు చేస్తుందని, ఆ పార్టీపై ఆగ్రహంగా ఉన్న రైతాంగం కూడా లోక్ సభ ఎన్నికల్లో అటువైపు టర్న్ అయ్యే అవకాశం ఉందంటున్నారు.
రుణమాఫీపై హరీష్ రావు సవాళ్ళ రాజకీయం ఇంతటితో చాలిస్తేనే ఆ పార్టీకి మంచిదని లేదంటే ఆయన వ్యూహం బెడిసికొడుతుందని అంటున్నారు.