హరీష్ రావు బీఆర్ఎస్ లో ద్వితీయ శ్రేణి పౌరుడిగా మారిపోతున్నారు. పార్టీకి అవసరం అయినప్పుడు ఆయన తెర ముందుకు వస్తున్నారు. కానీ ఆయనకు క్యాడర్ లో పట్టు పెరుగుతుందని అనుకున్నప్పుడు హఠాత్తుగా రెక్కలు కత్తిరిస్తున్నారు. రజతోత్సవ సభ విషయంలో హరీష్ రావును పూర్తిగా పక్కన పెట్టేయడంతో క్యాడర్ లో ఇదే తరహా చర్చ జరుగుతోంది.
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మొదట్లో హరీష్ రావును పిలిచి కేసీఆర్ సన్నాహాల గురించి మాట్లాడేవారు. రాను రాను ఆయనకు పిలుపులు ఆగిపోయాయి. కేటీఆర్, కవిత విస్తృతంగా పర్యటించి సన్నాహాలు చేశారు. అంత వరకూ బాగానే ఉన్నా.. హరీష్ కూడా ప్రాధాన్యం ఇస్తే బాగుండేది కదా అన్న వాదన వినిపిస్తోంది. హరీష్ పూర్తిగా సిద్దిపేటకే పరిమితమయ్యారు. అక్కడే ర్యాలీలు చేస్తున్నారు. తన వంతుగా సిద్దిపేట నుంచి సభకు జనాల్ని తరలిస్తారు. అక్కడి వరకే ఆయనకు ప్రాధాన్యత. ఉమ్మడి మెదక్ జిల్లా విషయంలోనూ ఆయనకు స్వేచ్చ ఇచ్చినట్లుగా లేదని బీఆర్ఎస్ వర్గాలంటున్నాయి.
కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న ఉమ్మడికరీంనగర్ జిల్లాలో హుజూరాబాద్ ఉపఎన్నిక వస్తే బాధ్యతలు కేటీఆర్ తీసుకోలేదు. హరీష్ చేతికి ఇచ్చారు. ఎదురు దెబ్బ తగులుతుదని అనుకున్న చోట.. హరీష్ ను ముందు పెట్టారు. మంచి ఫలితాలు వస్తాయనుకుంటే.. పక్కన పెడుతున్నారు. నిజానికి హరీష్ రావు పార్టీకి ఎంతో విశ్వసనీయంగా ఉంటారు. వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడరు.
అయితే ఇటీవలి కాలంలో పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి కేసీఆరే అని చెబుతున్నారు. అందరూ చెప్పేది ఇదే. కేటీఆర్ కూడా ఇదే చెబుతారు.కానీ హరీష్ రావు చెప్పే మాటల్లో వేరే అర్థం ఉందని బీఆర్ఎస్ కీలక నేతలు అనుమానించడంతోనే కొత్తగా ఆయన ప్రాధాన్యం తగ్గుతోందని అంటున్నారు. ఈ కారణంగా ఆయనపై పార్టీలో మరింత సానుభూతి పెరుగుతోంది.