ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడాన్ని కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో సవాలు చేయబోతోంది. ఈరోజు దాని కోసం రాష్ట్ర హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయబోతోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హరీష్ రావత్ ఈ పరిణామాలపై స్పందిస్తూ “ప్రధాని నరేంద్ర మోడి, భాజపా అధ్యక్షుడు అమిత్ షా ఇద్దరికీ నేను అధికారంలో ఉండటం ఇష్టం లేదు. అందుకే ఏదో విధంగా నన్ను తప్పించాలనే ప్రయత్నంలో గవర్నర్ పై ఒత్తిడి తెచ్చి నన్ను శాసనసభలో బలనిరూపణ చేసుకోమని ఆయన చేత ఆదేశింపజేశారు. నేను అందుకు సిద్దమవడంతో నాకు శాసనసభలో తగినంత మెజార్టీ ఉందని గ్రహించి, హడావిడిగా నిన్న రాష్ట్రపతి పాలన విధించేసారు. నా ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసం అందరూ కలిసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసారు. మాకు న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది. కనుక దాని ద్వారా ఈ అన్యాయంపై తప్పకుండా పోరాడుతాము,” అని చెప్పారు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రమయిన అరుణాచల్ ప్రదేశ్ లో ప్రభుత్వాన్ని పడగొట్టిన తరువాత, ఇప్పుడు ఉత్తరాఖండ్ ని పడగొట్టింది. త్వరలో హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కూలిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వీర్ భద్రసింగ్ అక్రమాస్తుల కేసులలో పీకల దాక మునిగి ఉన్నారు. ఈడి అధికారులు ఇప్పటికే ఆయనకి చెందిన కొన్ని ఆస్తులను జప్తు చేసాయి. ఆయనపై సిబీఐ, ఈడి కేసులు నమోదు చేసాయి. కనుక ఎప్పుడయినా ఆయన అరెస్ట్ అయ్యే అవకాశాలున్నాయి. అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో మాదిరిగానే అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల చేత భాజపా తిరుబాటు చేయించి ప్రభుత్వాన్ని కూల్చవచ్చును.
ఆ తరువాత ఇంకా అసోం, మేఘాలయ, మణిపూర్, మిజోరాం రాష్ట్రాలపై దృష్టి సారించవచ్చును. దక్షిణాదిన కేరళ, పుదుచేరిల శాసనసభలకు త్వరలో ఎన్నికలు జరుగబోతునందున ఇప్పుడు వాటికొచ్చిన ప్రమాదమేమీ లేదు. కానీ కర్నాటక రాష్ట్రంలో సిద్దరామయ్య ప్రభుత్వం అప్రమత్తంగా ఉండటం చాలా అవసరమే. ఎందుకంటే దక్షిణాదిన చాలా కాలం పాటు భాజపాకి కర్నాటక రాష్ట్రమే కంచుకోటగా ఉండేది. కనుక చేజార్చుకొన్న ఆ కంచుకోటని మళ్ళీ స్వాధీనం చేసుకొనేందుకు భాజపా ప్రయత్నిస్తే ఆశ్చర్యమేమీ లేదు. ఆంధ్రాలో తెదేపాకి భాజపా మిత్రపక్షంగా, రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటునప్పటికీ, వాటి మధ్య కూడా అంత సఖ్యత లేదు కనుక తెదేపా ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉండటం చాలా అవసరమే. అయితే అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో అమలుచేసిన పధకం దక్షిణాదిన పనిచేయకపోవచ్చును. అయినప్పటికీ దేశంలో భాజపాయేతర ప్రభుత్వాలన్నీ అప్రమత్తంగా ఉండటమే మంచిది.