మెగా హీరోలంటే హరీష్ శంకర్‌కి ఎంత అభిమానమో. పవన్ కల్యాణ్‌కి భక్తుడిగా అనిపించుకునే హరీష్… ఇప్పుడు చిరంజీవినీ ఆకాశానికి ఎత్తేశాడు. ‘తేజ్’ ఆడియో ఫంక్షన్‌కి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హరీష్ కూడా వచ్చాడు. చిరుని చూసి పులకించిపోయి కాళ్లమీద పడ్డాడు. తన స్పీచ్‌లోనూ చిరుని తెగ పొగిడేశాడు. ‘ఛాలెంజ్’ సినిమాలోని డైలాగ్‌ని గుర్తు చేస్తూ.. ‘ఈలాంటి ఫంక్షన్లకు మీరు రావడం మీకు చిన్నదే కావొచ్చు. కానీ మీరాక మాకు వంద కోట్లతో సమానం. మా ఫంక్షన్‌కి చిరంజీవిగారు వచ్చారు అన్న ఉత్సాహంతో ఇంకా బాగా పనిచేస్తాం” అంటూ పొగడ్తల కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ”సాధారణంగా అమ్మాయిల కళ్లు బాగుంటాయి. కానీ ఓ అబ్బాయి కళ్లు బాగుండడం చిరంజీవిలోనే చూశా” అన్న బాపు కాంప్లిమెంట్‌ని ఈ సందర్భంగా గుర్తు చేశాడు హరీష్. ”నా తమ్ముడు స్టార్ అయితే బాగుంటుంది అనుకుంటుంటా. నాకు పరిశ్రమలో అన్నదమ్ములెవరూ లేరు. కానీ.. తేజ్ రూపంలో ఓ స్టార్ నాకు తమ్ముడిగా దొరికాడు” అంటూ తన హీరోకీ కాంప్లిమెంట్లు ఇచ్చాడు. తేజ్‌కి ఈమధ్య వరుసగా ఫ్లాపులు తగులుతున్నాయి. ఇదే విషయం ప్రస్తావిస్తూ..’ఓ సినిమా హిట్టయితే మనం కష్టపడ్డామని అర్థం. ఫ్లాప్ అయితే ఇంకాస్త కష్టపడాలని అర్థం. మనకు నచ్చిన పని చేయడమే మన సక్సెస్.. అది నలుగురికీ నచ్చితే బోనస్. గెలుపుకీ, ఓటమికీ ఉన్న తేడా అదే’ అంటూ వేదాంతం వల్లించాడు హరీష్. మొత్తానికి మరోసారి తాను మెగా భక్తుడినని నిరూపించుకున్నాడు హరీష్.