పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలకు ఇబ్బంది కలగకుండా సినిమాలకు సమయం కేటాయిస్తూ ఇటీవలే రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పింక్ సినిమా రీమేక్ జరుగుతోంది. మే నెలలో రిలీజ్ కానున్న ఈ సినిమా తర్వాత మరో రెండు సినిమాలు కూడా పవన్ కళ్యాణ్ చేయనున్నాడు. ఒకటి క్రిష్ దర్శకత్వంలో పీరియాడికల్ మూవీ కాగా, మరొకటి హరీష్ శంకర్ దర్శకత్వంలో కమర్షియల్ సినిమా. అయితే హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో సినిమా కోసం ఒక రీమేక్ సబ్జెక్ట్ వెతుకుతున్నారని, అదయితే సేఫ్ అని భావిస్తున్నాడని ఒక గాసిప్ వెబ్సైట్ గాల్లో వార్తలు అల్లేసింది. అయితే హరీష్ శంకర్ దాదాపుగా ఆ వెబ్సైట్ గాలి తీసేసినంత పనిచేశారు. వివరాల్లోకి వెళితే..
మొన్నా మధ్య వచ్చిన మహర్షి సినిమాలో ఒక జర్నలిస్టు ఇలాగే గాల్లోకి రాళ్లు విసురుతుంటాడు. పెద్ద కంపెనీ సీఈఓ అయిన రిషి ఇండియాలో ఆరు వేల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నాడని వార్తలు తానే సృష్టిస్తుంటాడు. ఇదేమని పక్క వాళ్ళు అడిగితే, ఒకవేళ పొరపాటున సీఈవో అదే పని చేస్తే, మేము ముందే చెప్పాం అని అని బిల్డప్ ఇచ్చుకోవచ్చు, ఒకవేళ అలా చేయకపోతే, ప్లాన్ మార్చుకుని ఉంటాడు అంటూ మరొక వార్త వండొచ్చు అని సమాధానమిస్తాడు. ప్రస్తుతం ఒక గాసిప్ వెబ్సైట్ కూడా హరీష్ శంకర్ విషయంలో ఇలాగే గాల్లోకి రాయి విసిరినట్లు గా కనిపిస్తుంది.
హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో సినిమా కోసం రీమేక్ సబ్జెక్ట్ కోసం ప్రయత్నిస్తున్నాడని, రీమేక్ అయితే కమర్షియల్గా సేఫ్ అవుతుందని భావిస్తున్నాడని ఆ వెబ్సైట్ రాసుకొచ్చింది. వేదాళం సినిమా కానీ, తేరి సినిమా కానీ రీమేక్ చేయవచ్చని రాసుకొచ్చింది. తేరి సినిమా పోలీసోడు అనే పేరుతో తెలుగులోకి డబ్ అయ్యిందని, చాలా సార్లు ప్రసారం కూడా అయ్యిందని రాసుకొచ్చింది.
దీనికి హరీష్ శంకర్ సోషల్ మీడియా వేదికగా సమాధానమిస్తూ, మీరు మీ పాఠకులను తప్పుడు వార్తలతో తప్పుదోవ పట్టిస్తున్నారని, మీ రిపోర్టర్లు ఎవరైనా తనకు ఫోన్ కాల్ చేసుకుని నిర్ధారించుకుని వార్తలు రాస్తే బాగుంటుందని హరీశ్ శంకర్ ట్వీట్ చేశారు. భవిష్యత్తులో మీ పాఠకులను తప్పుదోవ పట్టించకుండా సరైన వార్తలు రాస్తే బాగుంటుందని ఆయన ఆ వెబ్ సైట్ కు హితవు పలికారు.
మొత్తానికి హరీష్ శంకర్ ఇచ్చిన క్లారిటీతో గాసిప్ వెబ్సైట్ గాలి తీసినట్టు అయింది.