‘మిస్టర్ బచ్చన్’ విడుదలకు ముందు హరీష్ శంకర్ పేరు ఎంత ట్రోల్ అయ్యిందో, విడుదలైన తరవాత కూడా అంతే స్థాయిలో ట్రోల్ అవుతోంది. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. దాంతో పాటు త్రివిక్రమ్ ఫ్యాన్స్ కూడా హరీష్ పై పగబట్టేశారు. ‘మిస్టర్ బచ్చన్’లో ‘గురూజీ’ అనే పాత్ర ఒకటి సృష్టించి, దాంతో కామెడీ పండించాలని చూశాడు హరీష్. ఇండస్ట్రీలో గురూజీ అని ఎవర్ని పిలుస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ పిలుపు.. ఒక్క త్రివిక్రమ్ కే సొంతం. ఇప్పుడు ఈ సినిమాలో త్రివిక్రమ్ పై కామెడీ చేయాల్సిన అవసరం, అఘత్యం హరీష్ కు ఏముందో ఎవరికీ అర్థం కాలేదు.
పవన్ కల్యాణ్‌తో హరీష్ సినిమా తీయాలనుకొన్నప్పుడల్లా త్రివిక్రమ్ మధ్యలో ఎంటరైపోవడం, తన సినిమాలకు లాకెళ్లిపోవడం, దాంతో హరీష్ సినిమాలు ఆగిపోవడం.. ఇలా జరుగుతూ వచ్చింది. పవన్ తో తన సినిమాలకు బ్రేకులు పడడానికి త్రివిక్రమ్ ఓ రకంగా కారణం అనేది ఇండస్ట్రీ వర్గాల మాట. ఆ కోపం ఇప్పుడు ఇలా తీర్చుకొన్నాడేమో అనే డౌటు వచ్చింది.
కానీ ఇప్పుడు హరీష్ ఈ గొడవలపై క్లారిటీ ఇచ్చాడు. త్రివిక్రమ్ తనకంటే సీరియర్ అని, డైలాగులపై తనకు ఆసక్తి కలగడానికి కారణం త్రివిక్రమ్ అని కాస్త సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. అంతేకాదు.. హరీష్ వాళ్ల నాన్న త్రివిక్రమ్ కి పెద్ద ఫ్యాన్ అట. ఇంట్లో పెద్దకొడుకులానే త్రివిక్రమ్ ని ట్రీట్ చేసేవారని, ‘త్రివిక్రమ్ ని చూసి ఎలా రాయాలో నేర్చుకో’ అంటూ తనకు హితబోధ చేసేవారని గుర్తు చేసుకొన్నాడు హరీష్. తెలుగు సినిమా చరిత్రలో త్రివిక్రమ్ పేరు మర్చిపోలేనిదని, తనంటే గిట్టని వాళ్లే ఇలాంటి రూమర్లు పుట్టిస్తున్నారని ఈ ఫ్యాన్స్ మీట్ లో చెప్పుకొచ్చాడు హరీష్.