పవన్ కల్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో ‘భవదీయుడు భగత్ సింగ్’ ప్రకటించి చాలా కాలమైంది. అయితే.. ఈ సినిమా సెట్స్‌పైకి ఎప్పుడు వెళ్తుందో తెలియడం లేదు. ఆలస్యం అవుతున్న కొద్దీ.. ఈ ప్రాజెక్టు ఉంటుందా, ఉండదా? అనే అనుమానాలు పవన్ అభిమానుల్లో బలంగా నాటుకుపోతున్నాయి. వీటన్నింటికీ పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు హరీష్ శంకర్. అందుకు.. ‘అంటే.. సుందరానికీ..’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ని వేదిక చేసుకొన్నారు. ఈరోజు హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో ‘అంటే.. సుందరానికీ..’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. ఈకార్యక్రమానికి.. పవన్ కల్యాణ్ అతిథిగా హాజరయ్యారు. హరీష్ కూడా వచ్చారు. ఇటు పవన్, అటు పవన్ కల్యాణ్ అభిమానులు ఉండగానే… తన ప్రాజెక్టు గురించి వస్తున్న రూమర్స్ క్లియర్ చేశారు.
సినిమా ఉంటుందో, ఉండదో అని చాలామంది రకరకాలుగా మాట్లాడుకుంటున్నారని, ఆలస్యమైనా, పది కాలాల పాటు గుర్తుండిపోయే సినిమా రాబోతోందని, ఈ సినిమాలోని పాటల గురించీ, మాటల గురించీ మాట్లాడుకుంటూనే ఉంటారని… పవన్ అభిమానులకు ఖుషీ చేసే వార్త చెప్పేశారు. అంతేకాదు.. పనిలో పనిగా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు క్లాస్ కూడా పీకారు. పవన్ అతిథిగా వచ్చిన ప్రతీ ఫంక్షన్లోనూ..ఫ్యాన్స్ అరచి గోల పెట్టడం, మిగిలిన వాళ్లని సజావుగా మాట్లాడనివ్వకుండా చేయడం మామూలైపోయింది. దాంతో పవన్ ఫ్యాన్స్ కే కాదు, పవన్‌కి కూడా చెడ్డ పేరు వస్తోంది. అందుకే ఈ సందర్భంగా పవన్ ఫ్యాన్స్ కు.. హరీష్ చిన్నపాటి క్లాస్ తీసుకొన్నాడు. “సినిమా అంటే ఒకే కుటుంబం కాదు. సినిమా అంతా ఒక కుటుంబం. పవన్ ఈ మాట నాతో చాలాసార్లు చెప్పారు. నాని ఫంక్షన్‌కి వచ్చినా, నితిన్ ఫంక్షన్ కి వచ్చినా అది పవన్‌కి సినిమాపై ఉన్న ప్రేమతోనే. ఆయన వచ్చినప్పుడు అభిమానులు ప్రశాంతంగా ఉండండి. మిగిలిన వాళ్లని మాట్లాడనివ్వండి. ఇలా గోల చేస్తే.. ఆయన ఏ ఫంక్షన్ కీ రారు. ఆయన్ని యూ ట్యూబ్లలో చూసుకోవడమే..“ అని పవన్ అభిమానుల అల్లరిని ఓ గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు.