వర్మ కాంపౌండ్ నుండి వచ్చిన దర్శకుడు హరీశ్ శంకర్.. మాస్ మహరాజ్ తో షాక్ అంటూ ప్రయత్నించి రవితేజతో పాటుగా ప్రేక్షకులకు షాక్ ఇచ్చిన హరీశ్ శంకర్ తర్వాత వచ్చిన మిరపకాయ్ తో ట్రాక్ లోకి వచ్చాడు. ఇక పవర్ స్టార్ తో గబ్బర్ సింగ్ అంటూ రికార్డుల రారాజుగా మారినా వచ్చిన అవకాశాలను సరిగా వాడుకోక బోల్తా పడ్డాడు. లాస్ట్ ఇయర్ మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ సుబ్రమణ్యం ఫర్ సేల్ డైరెక్ట్ చేసి పర్వాలేదనిపించుకున్నాడు.
అయితే హరీశ్ శంకర్ సినిమా తీస్తే హిట్ లేదంటే ఫట్ అన్న తీరున ఉంటుంది. యావరేజ్ గా సినిమాలు తీయడం ఈ దర్శకుడికి రాదనే చెప్పాలి. అయితే పవర్ స్టార్ తో తన తిక్కల లెక్కేంటో తేల్చి చెప్పిన హరీశ్ మొదటిసారి అక్కినేని హీరోతో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. ఏ మాయ చేసావేతో లవర్ బోయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న నాగ చైతన్య దడ, తడాఖా అంటూ మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నాలు చేసినా లాభం లేకుండా పోయాయి.
అందుకే ఈసారి అక్కినేని తిక్కను హరీశ్ శంకర్ కుదిర్చే పనిలో పడ్డాడట. నాగచైతన్యతో సినిమా తీసేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడట హరీశ్ శంకర్. మరి తన దర్శకత్వంలో హీరోలను పవర్ హౌజ్ గా చూపించే హారీశ్ అక్కినేని హీరోను ఎలా చూపించనున్నాడో చూడాలి. ప్రస్తుతం కథా చర్చలు నడుస్తున్న ఈ సినిమా గురించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడనున్నదని సమాచారం.