”చెప్పను బ్రదర్” వ్యవహారంతో బన్నీ ఫ్యాన్స్‌కీ పవన్ ఫ్యాన్స్‌కీ దూరం పెరిగిన విషయాన్ని ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన విషయం లేదు. అప్పటి నుంచీ. `పవన్` విషయంలో కాస్త అప్రమత్తంగానే వ్యవహరిస్తున్నాడు బన్నీ. డీజే ఆడియో ఫంక్షన్ ఆసాంతం గమనిస్తే.. ఓ విషయం అర్థం అవుతుంది. ఎక్కడా `పవన్` పేరు ప్రస్తావన లేకుండా.. అల్లు అర్జున్ గట్టిగానే వ్యవహరించారు. అల్లు అర్జున్ మాటల్లో, అరవింద్ మాటల్లో, దిల్‌రాజు స్పీచ్‌లో ఎక్కడా… పవన్ పేరు రాలేదు. అయితే…. హరీష్ శంకర్ మాత్రం బన్నీ కంట్రోల్ నుంచి బయటకు వచ్చి మరీ.. పవన్‌పై తనకున్న ప్రేమని చాటుకొన్నాడు. కట్టెకాలే వరకూ పవన్ ఫ్యాన్‌గానే ఉంటానని కాస్త గట్టి మాటలే చెప్పాడు. నిజానికి హరీష్ ఇక్కడ, ఈ సందర్భంలో పవన్ పేరు ప్రస్తావించాల్సిన అవసరం లేదు. అక్కడికొచ్చిన అభిమానులు కూడా ఎప్పట్లా.. ”పవర్ స్టార్.. పవర్ స్టార్” అని అరవనూ లేదు. కానీ.. హరీష్ పవన్ ప్రస్తావన తీసుకురావడం, పవన్‌ని పొగుడుతూ ఏకధాటిగా మాట్లాడడం, బన్నీ ముందే ”నేను పవన్ ఫ్యాన్స్” అంటూ పవన్ కల్యాణ్ అభిమానుల్ని ఖుషీ చేసే కార్యక్రమంలోకి దిగడం.. ఆశ్చర్యకరమే. `పవన్‌తో సినిమా ఎప్పుడు అని అడుగుతున్నారు…. ఆయన ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నా` అంటూ చివర్లో మనసులో ఉన్న మాటనీ బయటపెట్టేశాడు. మొత్తానికి `డీజే`లో పవన్ పేరు బయటకు తీసుకొచ్చి… పవన్ ఫ్యాన్స్ మనసుల్ని గెలుచుకొన్నాడు హరీష్. కాకపోతే.. బన్నీ రియాక్షన్ ఏంటన్నదే ఇంకా తెలీదు.