పవన్‌కల్యాణ్‌కి ఉన్న అరివీర భయంకరమైన భక్తుల్లో హరీష్ శంకర్ ఒకడు. సందర్భం ఉన్నా, లేకున్నా.. గబ్బర్ సింగ్ రోజుల గురించీ పవన్ కల్యాణ్ గురించీ చెబుతూనే ఉంటాడు. అయితే ఈసారి సందర్భం, అవసరం రెండూ వచ్చాయి. అందుకే పవన్ గురించి మాట్లాడుతూ తన భక్తిని మరోసారి చూపించుకున్నాడు. రవితేజ నటించిన ‘నేల టికెట్టు’ ఆడియో ఫంక్షన్‌కి పవన్ అతిథిగా వచ్చాడు. హరీష్ కూడా హాజరయ్యాడు. రవితేజ, పవన్‌లపై తనకున్న ప్రేమని, భక్తిని మరోసారి చూపించేశాడు. పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ‘ఆయనకు ఇదంతా అవసరమా’ అని తనని చాలామంది అడిగారని, పవన్ కల్యాణ్‌ని విజయవాడ పాద యాత్రలో చూసినప్పుడు, చెమటలతో తన చొక్కా అంతా తడిసిపోయినప్పుడు తనక్కూడా అదే ఫీలింగ్ కలిగిందన్నాడు హరీష్. ”ఏసీ కార్ వ్యాన్‌లోంచి అడుగుపెట్టిన పవన్‌ని చూశా. మండుడెంటలో చెమటల్లో తడిసిపోయిన పవన్‌ని చూశా. అప్పుడే ఇదంతా ఆయనకు అవసరమా అనిపించింది. కోట్ల సంపాదన, అభిమానుల కీర్తిని వదిలేసి ఈ తిట్లు భరించడం అవసరమా అనిపించింది. కానీ ఆయన సిద్దాంతం, ఆయన ఆశయం, నమ్మకం నాకు తెలుసు. ఆ దారిలో ఆయన విజయం అందుకోవాలి” అంటూ మరోసారి సిసలైన భక్తుడి అవతారం ఎత్తాడు హరీష్.