‘దువ్వాడ జగన్నాథమ్ – డీజే’ విడుదలై ఏడాది దాటింది. ఈలోపు అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చేశారు. కొత్త సినిమా కథ కోసం తెగ వెతుకుతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా ఏ దర్శకుడు కథ చెబుతానన్నా వద్దనకుండా వింటున్నార్ట! కానీ, ఏ సినిమా సెట్ కావడం లేదు. అల్లు అర్జున్ సంగతి పక్కన పెడితే… ‘దువ్వాడ జగన్నాథమ్’ దర్శకుడు హరీష్ శంకర్ పరిస్థితి కూడా ఇంతే! ఆ సినిమా విడుదల తర్వాత అల్లు అర్జున్ ఒక్క సినిమా చేశాడు. హరీష్ శంకర్ మాత్రం ఏమీ చేయలేదు. దిల్‌రాజు కాంపౌండ్‌లో వున్నారు. ‘దాగుడు మూతలు’ టైటిల్‌తో ఒక మల్టీస్టారర్ కథ రెడీ చేశారు. కానీ, నిర్మాతకు నచ్చలేదు. మీడియా ముందు హరీష్‌కి, తనకీ కథ సంతృప్తినివ్వలేదని చెప్పారు. దాంతో ఆ సినిమా ఆగింది. ఇక, అక్కడ కష్టమని హరీష్ శంకర్ బయటకు వచ్చి ప్రయత్నాలు సాగిస్తున్నార్ట!
ప్రయత్నాల్లో భాగంగా మహేశ్‌బాబుతో ‘వన్ నేనొక్కడినే’, ‘ఆగడు’ సినిమాలు నిర్మించిన 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర దగ్గరకు హరీష్ శంకర్ వెళ్లారని సమాచారం. ప్రసుత్తం కథాచర్చలు నడుస్తున్నాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా నిర్మించడానికి నిర్మాతలు సుముఖంగా వున్నార్ట! అయితే… ఎవరు సినిమా నిర్మిస్తారనేది తెలాల్సి వుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద అనిల్ సుంకర చిన్న సినిమాలను మాత్రమే నిర్మిస్తారు. బడా బడా సినిమాలను 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంటతో కలిసి నిర్మించేవారు. వరుణ్‌తేజ్ హీరోగా ‘అప్పట్లో ఒకడుండేవాడు’ ఫేమ్ సాగర్ చంద్ర దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్ మీద రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఒక సినిమా నిర్మిస్తారని ప్రకటించారు. అప్పట్లో ముగ్గురి మధ్య మనస్ఫర్థలు వచ్చాయనే టాక్ వినిపించింది. హరీష్ శంకర్ సినిమాతో ముగ్గురూ మళ్లీ కలుస్తారో? లేదా ఆచంట అన్నదమ్ములు నిర్మిస్తారో? సినిమా నిర్మించడం మాత్రం ఖాయమేనట!!