”గుడిలో మడిలో ఒడితో.. ”అనే ‘డీజే’ పాట వివాదాల ఊబిలో ఇరుక్కొన్న సంగతి తెలిసిందే. ఈ పాటలో పదాల విషయంలో బ్రాహ్మణ సంఘం అభ్యంతరం చెప్పడం, దానికి హరీష్ శంకర్ దిగి వచ్చి బ్రాహ్మణులకు క్షమాపణలు కోరడం, అభ్యంతరకరమైన పదాల్ని తొలగిస్తానని మాట ఇవ్వడం.. ఈ ఎపిసోడ్లన్నీ గుర్తుండే ఉంటాయి. కాకపోతే డీజే ఆడియో ఫంక్షన్లో మాత్రం హరీష్ శంకర్ స్వరం మారింది. గీత రచయితలకు చాలా పరిమితులుంటాయి. ఆ పరిమితులకు లోబడే పాట రాస్తారు.. ఓ బ్రాహ్మణుడు ప్రేమలో పడితే – గుడిలో బడిలో అనే పాటే పాడుకొంటాడు.. మరో పాట రాదు.. నా సినిమాలో పాటలు బాగుంటే అది రాసిన వాళ్ల గొప్ప… బాగాలేకపోతే.. అది నా పొరపాటు“ అంటూ కాస్త ఆవేశంగానే మాట్లాడాడు. ఇదంతా బ్రాహ్మణ సంఘానికి హరీష్ ఇచ్చిన కౌంటర్‌గానే అనిపిస్తోంది. నిజానికి ఈ వివాదానికి ఇది వరకే పుల్ స్టాప్ పెట్టేశారనుకొన్నారంతా. చిత్రబృందం అదే కోరుకొంటే.. ఆడియో ఫంక్షన్లో అసలు ఈ పాట ప్రస్తావనే తీసుకురాకూడదు. కానీ.. హరీష్ కావాలని మళ్లీ కెలుక్కొన్నాడు. దాన్ని బట్టి.. చిత్రబృందమే ఈ వివాదాన్ని తిరిగి తోడాలనుకొంటుందా?? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. సినిమా విడుదల దగ్గర పడుతున్న తరుణంలో.. హరీష్ ఇలా మాట్లాడడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ‘సారీ’ చెప్పి, ‘పదాలు మారుస్తాం’ అని మాట ఇచ్చినప్పుడు ఆ ప్రస్తావన తీసుకురాకపోతేనే బాగుండేది. కానీ ఎగ్రసివ్ మైండ్ సెట్ గల హరీష్… తన స్వభావాన్ని అంత తేలిగ్గా వదులుకోలేడు కదా? అందుకే డీజే వేదికపై బయటపడిపోయాడు. దీని రిజల్ట్ ఏంటో తెలియాలంటే.. వేచి చూడాల్సిందే.