పవన్ కల్యాణ్ దూకుడు చూపిస్తున్నాడు. వన్ ప్లస్ టూ ఆఫర్లా ఒకేసారి మూడు సినిమాల్ని మొదలెట్టేశాడు. ఇప్పటికే రెండు సినిమాలు పట్టాలెక్కేశాయి. ఇప్పుడు మూడో సినిమా క్లాప్ కొట్టడానికి రెడీ అయ్యింది. పవన్ కల్యాణ్ మైత్రీ మూవీస్ దగ్గర ఎప్పుడో అడ్వాన్స్ తీసుకున్నాడు. ఆ సంగతి తెలిసిందే. మైత్రీ మూవీస్ కూడా పవన్ కోసం కథని సిద్ధం చేయడంలో తలమునకలైపోయింది. ఎట్టకేలకు పవన్‌కు సరిపడా కథ దొరికేసింది. పవన్ భక్తుడు గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ చేతిలో ఈ ప్రాజెక్టు పడింది. గబ్బర్ సింగ్ తరవాత పవన్‌తో మరో సినిమా చేయాలని హరీష్ శంకర్ చాలా ప్రయత్నించాడు. కానీ కుదర్లేదు. గద్దల కొండ గణేష్ హిట్ తరవాత.. ఆ ఛాన్స్ హరీష్‌ని వరించింది. ఈ కాంబోని మైత్రీ మూవీస్ అధికారికంగానూ ప్రకటించింది. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని నిర్మాతలు తెలిపారు. ఈ వేసవిలో `పింక్` రీమేక్ విడుదల అవుతుంది. క్రిష్ సినిమా యేడాది చివర్లో రావొచ్చు. ఆ తరవాతే… హరీష్ సినిమా ఉంటుందా, లేదంటే క్రిష్ సినిమాతో పాటు సమాంతరంగా ఈ సినిమాని పట్టాలెక్కిస్తారా అనేది తెలియాల్సివుంది.