పవన్ కల్యాణ్ అభిమాని – అనే స్థాయిని దాటేసి – అనుచరుడు అనే పిలుపుని మించి – భక్తుడుగా మారిపోయాడు హరీష్ శంకర్. పవన్ ని పల్లెత్తు మాట అన్నా సరే, అస్సలు ఊరుకోడు. ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో అయినా, పవన్ వెంటే ఉంటానంటాడు. ఇప్పుడు పవన్ కరోనా బాధితుల సహాయార్థం 2 కోట్లు ప్రకటించాడు. నిజంగా ఇది పెద్ద మొత్తమే. దాంతో పవన్ అభిమానులు `ఇదిరా మా పవన్ అంటే ` అంటూ గర్వంగా రొమ్ములు విరుస్తున్నారు.
హరీష్ శంకర్ కూడా తన అభిమానాన్ని, పవన్ గొప్పతనాన్ని ట్విట్టర్ సాక్షిగా చాటుకున్నాడు. పవన్ కి పై కామెంట్లు చేస్తున్నవారిని ఉద్దేశిస్తూ “ఇంకా సినిమాలెందుకు అని అనకండి. కొంతమందికి సినిమా అవసరం, కొంతమంది సినిమాకి అవసరం“ అంటూ పవన్ కల్యాణ్ విరాళం ప్రకటించిన ట్వీట్‌ని రీ ట్వీట్ చేశాడు. సినిమాలు ఉన్నా, లేకపోయినా, చేతిలో అధికారం ఉన్నా, లేకపోయినా, ఒక్క సీటు (అది కూడా ఉందో లేదో తెలియని పరిస్థితి) సంపాదించినా – ప్రజలకు సాయం చేయడానికి ఎప్పుడూ ముందుకొచ్చే పవన్ కల్యాణ్‌ని చూసి అభిమానులంతా ఉప్పొంగాల్సిందే.