హరీష్ శంకర్… ఎవరికీ లొంగడు. దేనికీ భయపడడు. ముఖ్యంగా తనపై అవాకులూ, చవాకులూ రాస్తున్న వాళ్లని ఏమాత్రం లక్ష్య పెట్టడు. గాసిప్పులు రాసి, పబ్బంగడుపుకొనే సైట్లని, ఆ సైట్ పేరు చెప్పుకొనే బ్లాక్ మెయిల్ రాయుళ్లనీ తాట తీసి వదిలిపెడతాడు. హరీష్ శంకర్ కు సినిమాల్లేక ఫస్ట్రేషన్ ఎక్కువైందని, రాత్రంతా తాగుతున్నాడని ఓ వెబ్ సైట్ రాస్తే… ”నాకు సోడా పోశావా.. పెగ్గు కలిపావా” అంటూ డైరెక్టుగానే ఎటాక్‌కు దిగిపోయాడు హరీష్. ఆ ఫంక్షన్లో హరీష్ స్పీచు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.
ఇప్పుడు మరోసారి సదరు బ్లాక్ మెయిలింగ్ జర్నలిస్టుపై కోపం వచ్చింది. ”రిలీజ్ టైమ్ దగ్గర పడుతోంది కదా, ఏం పోస్ట్ చేసినా భయపడిద తగ్గుతాడు అని, ఒక ముసలి నక్క మళ్లీ మొదలు పెడుతోంది. దయ చేసి అలాంటి అపోహలు పెట్టుకోవద్దని మనవి. నా జోలికొస్తే రేపు రిలీజ్ అయినా వదలను” అంటూ డైరెక్టుగానే వార్నింగ్ ఇచ్చాడు.
హరీష్ శంకర్ – రవితేజల ‘మిస్టర్ బచ్చన్’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. మరోవైపు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా ఉంది. ఈ రెండు సినిమాలపై ఓ వెబ్ సైట్ నెగిటీవ్ వార్తలు రాస్తోంది. ఆ వెబ్ సైట్ పేరు చెప్పుకొనే ఓ జర్నలిస్టు తన ట్విట్టర్లో ఈ రెండు సినిమాల్ని ఉద్దేశించి తప్పుడు వార్తలు రాస్తున్నాడనే హరీష్ ఇలా వార్నింగ్ ఇవ్వాల్సివచ్చిందని తెలుస్తోంది. ప్రస్తుతం హరీష్ ట్వీట్ వైరల్ అవుతుంది. ‘నువ్వు ఏమాత్రం తగ్గొద్దన్నా..’ అంటూ ఫ్యాన్స్ కూడా హరీష్ శంకర్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్ ఎంత తీస్తే అంతా రిలీజ్ చేసేయ్. సగం సినిమా ఉన్నా, హిట్ చేసేస్తాం’ అంటూ సోషల్ మీడియాలో గోల గోల చేస్తున్నారు. దాంతో ఆ ముసలి నక్క ఎవరూ? అంటూ అందరిలోనూ ఆరా మొదలైంది.