Harom Hara movie Review
తెలుగు360 రేటింగ్: 2.5/5
ఇలాంటి సినిమా ఇప్పటివరకూ తెలుగులో రాలేదు…
టాప్ టెన్ యాక్షన్ సినిమాల్లో ఈ సినిమా చేరిపోతుంది…
బ్లాక్ బస్టర్ పక్కా.. అందులో డౌట్ లేదు
‘హరోం హర’ సినిమా గురించి సుధీర్ బాబు చెప్పిన మాటలివి. ఎప్పుడూ ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వని ఆయన సినిమా గురించి ఇంతలా చెప్పడం, దీనికి తోడు ట్రైలర్ కూడా మంచి బజ్ క్రియేట్ చేయడంతో నిజంగా సుధీర్ బాబుకి ఓ మాస్ యాక్షన్ హిట్ పడిపోతుందనే నమ్మకం కలిగింది. మరా నమ్మకం నిజమైయిందా? సుధీర్ బాబు కొరుకునే విజయం దక్కిందా?
అది 80వ దశకంలోని కుప్పం. తమ్మిరెడ్డి ఆ ప్రాంతన్ని తన గుప్పిట్లో పెట్టుకొని అరాచకం చేస్తుంటాడు. కనిపించిన భూమిని కబ్జా చేస్తాడు. అడ్డుతిరిగిన వారిని అంతం చేస్తుంటాడు. తమ్మిరెడ్డికి భయపడి అక్కడి ప్రజలు చాలా మంది వేరే ప్రాంతానికి వెళ్లి తల దాచుకుంటారు. ఇలాంటి సమయంలో ఉప్పం పాలిటెక్నిక్ కాలేజ్ కి ల్యాబ్ అసిస్టెంట్ గా వస్తాడు సుబ్రమణ్యం (సుధీర్ బాబు). ఓ సందర్భంలో తమ్మిరెడ్డి మనుషులతో గొడవపడి ఉద్యోగాన్ని పోగొట్టుకుంటాడు. మరో వైపు తండ్రి చేసిన అప్పులు తీర్చే బాధ్యత సుబ్రమణ్యం మీద పడుతుంది. ఇలాంటి సమయంలో స్వతహాగా గన్ తయారు చేయాలనే ఆలోచన చేస్తాడు సుబ్రమణ్యం. తర్వాత ఏం జరిగింది? అక్రమ ఆయుధాల మాఫియాలో సుబ్రమణ్యం ఏ స్థాయికి ఎదిగాడు? తనకు ఎలాంటి శత్రువులు పుట్టుకొచ్చారు? ఎలాంటి సవాళ్ళు ఎదురుకున్నాడు? అనేది తక్కిన కథ.
ఈ మధ్య కాలంలో మంచి హైప్ క్రియేట్ చేసిన ట్రైలర్స్ లో హరోం హర ఒకటి. యాక్షన్, కలర్ టోన్, మ్యూజిక్, గన్ బ్యాక్ డ్రాప్ ఇవన్నీ ఫ్రెష్ గా అనిపించాయి. రూరల్ బ్యాప్ డ్రాప్ లో మాస్ యాక్షన్ కమర్షియల్ తీయాలనేది దర్శకుడు ఆలోచన. దీని కోసం ఓ గన్ స్మిత్ క్యారెక్టర్ ని రాసుకున్నాడు. ఇది కొత్త క్యారెక్టరే. తెలుగులో రాని క్యారెక్టరే. అయితే ఆ క్యారెక్టర్ ని చుట్టూ నడిపిన కథ, కథనాలు, డ్రామా మాత్రం పుష్ప, కేజీఎఫ్, ఛత్రపతి, విక్రమ్ ఇలా ఎన్నో హిట్ సినిమాలని అడుగడుగునా గుర్తు చేస్తుంది.
కేజీఎఫ్ స్టయిల్ గుర్తు చేస్తూ… హీరో గురించి ఫళని స్వామీ( సునీల్) పోలీస్ స్టేషన్ లో ఎలివేషన్స్ ఇచ్చే ఎపిసోడ్ తో కథ మొదలౌతుంది. తమ్మిరెడ్డి అరాచాకాలు చూస్తున్నప్పుడు రొట్టకొట్టుడు విలనిజం ఫీలింగ్ కలిగిస్తుంది. సుబ్రమణ్యం ఎంట్రీ ఓ మంచి పాటతో మొదలవుతుంది. హరోం హర.. ట్రాక్ ఈ ఆల్బమ్‌లోనే వినదగినది. ఆ పాటలో ఓ ప్లజెంట్ లో హీరో ఎంట్రీ ఇస్తాడు. హీరో రాకతో కథలో సరికొత్త మార్పు, గమనం రావాలి. అయితే ఆ ప్రయాణం ఆశించినంత వేగంగా సాగదు.
హీరో తుపాకులు తయారు చేయడం, ఆ నేపధ్యంలో అతడికి ఎదురైన సవాళ్ళు చూపించడం ఈకథ మెయిన్ ప్లాట్. అయితే ఆ పాయింట్ లోకి వెళ్ళడాని చాలా సమయం తీసుకున్నారు. ఎంతకీ పాయింట్ మొదలవ్వడం లేదనే ఫీలింగ్ ప్రేక్షకులలో కలుగుతుంది. పైగా హీరో తొలి సన్నివేశంలోనే తమ్మిరెడ్డి మనుషులని చిత్తుగా కొట్టేసినప్పుడు, తను గన్ తయారు చేసిన, ఇంకొకటి చేసిన హీరోయిజంలో పెద్ద కిక్ వుండదు. ఇందులో కూడా అదే జరిగింది. హీరో పాత్ర చుట్టూ ఎదో అద్భుతమైన ఫ్లాష్ బ్యాక్ వుందనే విధంగా ఎలివేషన్స్ ఇస్తూ వుంటారు. ఇంటర్వెల్ బ్యాంగ్ లో అలాంటి ఎలివేషన్ రివిల్ అయ్యే ఓ సిట్యువేషన్ క్రియేట్ అవుతుంది. అలాంటిది ఏదైనా వున్నా కొంచెం బెటర్ గా వుండేది. కానీ మళ్ళీ బాషా సినిమాతో పోలికని భావించారేమో.. సడన్ గా తండ్రి పాత్రని ప్రవేశపెట్టి బలవంతంగా ఎమోషన్ ని పిండే ప్రయత్నం జరిగింది.
సెకండ్ హాఫ్ లో కూడా అదే రొటీన్ రైటింగ్ కనిపిస్తుంది. ఛత్రపతి సినిమాని గుర్తు చేస్తూ ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ తీశారు. రవి కాలే క్యారెక్టర్ ని చంపినపుడే తమ్మిరెడ్డి కూడా అదే సీన్ లో ఉంటాడు. అదే ఊపులో తమ్మిరెడ్డిని కూడా లేపేస్తే సినిమా అక్కడితో అయిపోతుంది. కానీ సెకండ్ ఛాన్స్ అంటూ రన్ టైం ని ఇంకా సాగదీశారు. చివరి ముఫ్ఫై నిమిషాలైతే సాదీతగా అనిపిస్తుంది. విక్రమ్ కేజీఎఫ్ స్టయిల్ లో ఏదో యాక్షన్ సీన్స్ వస్తుంటుంది కానీ అందులో ఎమోషన్ ఆడియన్ కి కనెక్ట్ అవ్వదు. దీనికి కారణం హీరో విలన్ కి మధ్య బలమైన సంఘర్షణ లేకపోవడమే. మధ్యలో `జ్యోతిలక్ష్మి` సీన్ ఒకటి సెకండాఫ్‌ని కాపాడింది. ఇలాంటి మరో రెండు మూడు ఉండి, వాటి చుట్టూ బలమైన ఎమోషన్ మిక్స్ చేస్తే, `హరోం హర` టార్గెట్ రీచ్ అయ్యేది.
బ్యాక్ డ్రాప్ కొత్తగా ఉండడం ఈ సినిమా ప్లస్ పాయింట్. కథనం రొటీన్‌గా ఉన్నా.. చివరివరకూ చూసేలా చేసింది మ్యూజిక్, విజువల్స్. చైతన్ భరద్వాజ్ ఇచ్చిన పాటలు, స్కోర్ ఆకట్టుకునేలా వున్నాయి. తెరపై ఓ రొటీన్ సీన్ నడుస్తున్నా ఏదో జరుగుతుందనే ఆసక్తిని తన మ్యూజిక్ తో బిల్డ్ చేయగలిగాడు. యాక్షన్ ఘట్టాల్ని బాగా డిజైన్ చేశారు. అవన్నీ విడి విడిగా చూస్తే మాస్కు నచ్చుతాయి. కానీ ఎంత పెద్ద యాక్షన్ సీన్ అయినా, ఎమోషన్ జోడిస్తేనే అవి పండుతాయి. కథకు బలాన్ని ఇస్తాయి. ఈ విషయాన్ని దర్శకుడు విస్మరించాడు. అరవింద్ కెమరాపనితనం కూడా చాలా బావుంది. ప్రేక్షకుడిని లీనం చేసే విధంగా విజువల్స్ ని పట్టుకున్నాడు. ముఖ్యంగా మాటలు బావున్నాయి. ముఖ్యంగా పాత్రలన్నీ కుప్పం యాస మాట్లాడటం సహజత్వాన్ని తీసుకొచ్చింది. అయితే యాసని ఫాలో అయ్యే క్రమంలో కొన్ని రిజిస్టర్ కానీ మాటలు కూడా పడ్డాయి.
సుధీర్ బాబు ఇంత మాస్ యాక్షన్ చేయడం ఇదే తొలిసారి. యాక్షన్ సీన్స్ కోసం కష్టపడ్డాడు. అయితే ఇప్పటివరకూ సుధీర్ కి ఇంత మాస్ యాక్షన్ సినిమా లేకపోవడంతో హరోం హర తనకి శ్రుతిమించిన డోస్ ఏమో అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. ఎమోషనల్ సీన్స్ తన నటన సెటిల్డ్ గా వుంది. మాళవిక పాత్రకు పెద్ద ప్రాధాన్యత లేదు. పైగా ఆ ప్రేమకథలో స్పష్టత కొరవడింది. సునీల్ కి నిడివి వున్న పాత్రే దక్కింది కానీ ఆ పాత్రని తీర్చిద్దిన తీరు రొటీన్ గా వుంది. పెద్ద విలన్ గ్యాంగ్ వుంది కానీ ఎవరికీ ప్రాధాన్యత లేదు. ఎమోషన్ బిల్డ్ కాకపోవడంతో సినిమా చాలా లెంగ్తీ గా అనిపిస్తుంది.
దర్శకుడిలో మాస్ టచ్ వుంది. మాస్‌ని ఎలా మెప్పించాలో తనకు తెలుసు. విజువల్ సెన్స్ కూడా ఉంది. పాత్రలకు పేర్లు పెట్టడం దగ్గర్నుంచి, ఎలివేషన్లు వర్కవుట్ చేయడం వరకూ తన ప్రతిభను చూపించాడు. సుబ్రమణ్యేశ్వర స్వామి వాహనం నెమలి. దాన్ని కొన్ని షాట్లలో సింబాలిక్‌గా వాడుకొన్న విధానం బాగుంది. అయితే కథ కథనాలు విషయంలో ఇంకా బలంగా వర్క్ చేయాల్సింది. సుధీర్ బాబు ఓ మాస్ హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. ఆ నిరీక్షణని ‘హరోం హర’ ఇంకా పొడిగించింది. కాకపోతే ఈమధ్య వచ్చిన సుధీర్‌బాబు సినిమాల్లో ‘హరోం హర’ కాస్త బెటర్ అవుట్ పుట్ ఇచ్చింది.
తెలుగు360 రేటింగ్: 2.5/5