పాస్టర్ ప్రవీణ్ పగడాల విషయంలో ఏం జరిగిందో అందరూ చూశారు. ఆయనను చంపాల్సిన అవసరం ఎవరికీ లేదని తేలిపోయింది. ఆయన కుటుంబ సమస్యల కారణంగానో.. మరో కారణంగానో కానీ మద్యం మత్తులోనే డ్రైవింగ్ చేశారు. ఆయన ఎన్ని సార్లు ప్రమాదానికి గురయ్యారో అందరూ చూశారు. అయినా ఆయన రాజమండ్రిలో చనిపోవడం తమ కోసమే అన్నట్లుగా హర్షకుమార్ లాంటి రాజకీయ నేతలు రాజకీయం చేసుకుంటున్నారు.
రాజమండ్రిలో చనిపోతే మాత్రం ఇలా రాజకీయం చేస్తారా ?
కాంగ్రెస్ పార్టీ నేత హర్ష కుమార్ రాజకీయం ఆయన కుమారులకు రాజకీయ భవిష్యత్ లేకుండా చేస్తోంది. ఇద్దరు కుమారులకు రాజకీయ భవిష్యత్ ఇవ్వడానికి తాను రాజకీయంగా సర్వైవ్ కావడానికి ఆయన పడుతున్న ఫేక్ తాపత్రయంతో మొదటికే మోసం వస్తోంది. ప్రవీణ్ పగడాల రోడ్డు ప్రమాదంలో చనిపోవడం..అదీ కూడా రాజమండ్రిలో చనిపోవడం తనకు వచ్చిన అవకాశంగా హర్షకుమార్ భావిస్తున్నారు. ఆయన అవసరం లేని వివాదాలతో ఏదో చేద్దామనుకుంటున్నారు. వైసీపీ సానుభూతిపరులైన పాస్టర్లతో ప్రభుత్వాన్ని తిట్టిస్తున్నారు. ఇదంతా ఆయన రాజకీయం కోసం చేస్తున్నారు. ప్రవీణ్ ఆత్మకు శాంతి లేకుండా రాజకీయం చేస్తున్నారు.
పదవుల కోసం అల్లాడిపోతున్న హర్షకుమార్ కుటుంబం
అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ కుమారుడు ఇటీవల గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశారు. అందులో ఆయనకు మూడు, నాలుగు వందల ఓట్లు కూడా రాలేదు. ప్రధాన పార్టీలకు పోటీగా ఖర్చు పెట్టుకుని ఆయన ప్రచారం చేస్తే వారి విద్యా సంస్థల్లో పని చేసే వారు .. చదివిన వారు కూడా హర్షకుమార్ కొడుక్కి ఓటు వేయలేదు. ఆయన టీడీపీలో చేరాలని చాలా ప్రయత్నం చేశారు. 2019 ఎన్నికల సమయంలో జగన్ హ్యాండివ్వడంతో ఆయన చంద్రబాబును కలిశారు. ఓ సందర్భంలో కాళ్లకు నమస్కారం కూడా చేశారు. ఆ తర్వాత వైసీపీ హయాంలో ఆయన నాలుగైదు నెలలు పరారీలో ఉండి.. తర్వాత యాభై రోజుల పాటు జైల్లో ఉన్నారు. గత ఎన్నికలకు ముందు టీడీపీ టిక్కెట్ కోసం ప్రయత్నించారు. చివరికి గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం ప్రయత్నించారు. కానీ ఆయనను ఎవరూ పట్టించుకోలేదు. అందుకే ఇప్పుడు ప్రవీణ్ పగడాల మృతితో క్రిస్టియన్ రాజకీయం చేస్తున్నారు.
సోనియా పేరుతోనూ తాజాగా తప్పుడు ప్రచారం
పార్టీ నేతగా తమ పార్టీ అధ్యక్షురాలికి హర్షకుమార్ ఓ లేఖ రాశారు. ఆ లేఖ అందిందని.. ఆయన ప్రస్తావించిన అంశాలు దృష్టిలో ఉంచుకుంటానని సోనియా లేఖ పంపారు. సాధారణంగా ఇలాంటి అక్నాలెడ్జ్ మెంట్లు సోనియా ఆఫీసు నుంచి పంపుతారు. అదో ప్రోటోకాల్. కానీ అదేదో జాతీయ సమస్యగా సోనియా గుర్తించారని.. ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. ఆయన తీరుతో ప్రవీణ్ పగడాల ఆత్మకు శాంతి లేకుండా పోతోంది. పాస్టర్ కుటుంబసభ్యులు కూడా ఆయన గౌరవాన్ని కాపాడాలని కోరుతున్నా .. తన రాజకీయమే ముఖ్యమని హర్షకుమార్ చెలరేగిపోతున్నారు.