ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు .. వైసీపీ కోసం పని చేస్తున్నట్లుగా అందరూ భావిస్తున్నారు కానీ.. ఆయన లక్ష్యం మాత్రం.. చిరంజీవిని ముఖ్యమంత్రిని చేయడం అట. ఈ కొత్త కోణాన్ని మాజీ ఎంపీ హర్షకుమార్ ఆవిష్కరించారు. అంతర్వేది రథం దగ్దం వెనుక రాజకీయం మొత్తం.. కాపు కులాన్ని రెచ్చగొట్టాడనికేనని ఆయన అంటున్నారు. అంతర్వేది ఆలయం జనసేన రెబల్ ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉండడం వల్లే.. రథం దగ్ధం ఘటనను జనసేన, బీజేపీ రాజకీయం చేస్తున్నాయని హర్షకుమార్ విశ్లేషించారు. ఆర్ఎస్ఎస్ ద్వారా కాపు సామాజికవర్గాన్ని రెచ్చగొడుతున్నారని.. బీజేపీ మతాభిమానంతో.. జనసేన కులాభిమానంతో కుళ్లిపోయాయిని మండిపడ్డారు.
సోము వీర్రాజుకి కులాభిమానం ఎక్కువ..చిరంజీవిని సీఎం చేయడమే ఆయన లక్ష్యమని.. చిరంజీవి కుటుంబానికి సోము వీర్రాజు హనుమంతుడిలా మారారని అంటున్నారు. సోము వీర్రాజు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎంపిక కాగానే… చిరంజీవిని, పవన్ కల్యాణ్ ను కలిశారు. బీజేపీ-జనసేన అధికారంలోకి వచ్చేసినట్లేనని ఆయన ఎప్పుడూ చెబుతూ వస్తున్నారు. బహుశా.. చిరంజీవి ముఖ్యమంత్రి అభ్యర్థి కావొచ్చని హర్ష కుమార్ వ్యాఖ్యలతో అర్థం అవుతోందనే చర్చ ప్రారంభమయింది. సీబీఐ విచారణకు ఆదేశించడంపైనా హర్షకుమార్ మండిపడ్డారు.. దళితుడికి శిరోముండనం చేయిస్తే సీబీఐ విచారణ ఎందుకు చేయించలేదని సీఎం జగన్ ఒక్కో కులానికి, మతానికి ఒక్కోలా నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు.
సీఎం జగన్కు దళితులపై చిత్తశుద్ధి ఉంటే శిరోముండనం ఘటనపై..సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకూ బీజేపీ ఏపీ అధ్యక్షుడి చర్యలు వైసీపీకి అనుకూలం అనుకునేవారు ఇప్పుడు చిరంజీవి కోసం అనుకుంటున్నారు. మరి బీజేపీ కోసం పని చేస్తారని ఎవరైనా ఎప్పుడు అనుకుంటారో..?