బోటు ప్రమాదం విషయంలో తప్పుడు ప్రకటనలు చేశారంటూ.. పోలీసులతో కేసు పెట్టించేసి.. అరెస్ట్ చేయించేందుకు ఏపీ ప్రభుత్వ హర్షకుమార్ కోసం వెదుకుతోంది. ఆయన మాత్రం.. బోటు ప్రమాదం విషయంలో ప్రభుత్వాన్ని వదిలిపెట్టే అవకాశమే లేదంటూ… నేరుగా సుప్రీంకోర్టుకు వెల్లారు. బోటుతో పాటు మిగిలిన మృతదేహాలను వెలికితీసేలా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలివ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బోటు వెలికితీతపై నిర్లక్ష్యం చేస్తున్నారని పిటిషన్లో హర్షకుమార్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బోటు విషయంలో ప్రభుత్వం తీరును ఆయన మొదటి నుంచి విమర్శిస్తున్నారు. బోటును బయటకు తీసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ఆయన అంటున్నారు.
బోటు బయటకు తీస్తే.. ప్రభుత్వ వైఫల్యం బయట పడుతుందని అంటున్నారు. ధర్మాడి సత్యం అనే వ్యక్తికి రూ. పాతిక లక్షల రూపాయలకు కాంట్రాక్ట్ ఇచ్చింది.. బోటును వెలికి తీయడానికి కాదని.. బోటును తీయకుండా ఉండటానికని హర్షకుమార్ అంటున్నారు. ఈ క్రమంలో ఆయనపై పోలీసు కేసు నమోదయింది. పోలీసులు వెంటనే అరెస్ట్ చేయకపోడంతో.. హర్షకుమార్ ఆజ్ఞాతంలోకి వెళ్లారు. దీనికి కారకుడంటూ.. ఓ సీఐ పైనా పోలీసులు సస్పెన్షన్ వేటు వేశారు. అయినప్పటికీ హర్షకుమార్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఆయన బోటు విషయంలో ప్రభుత్వానిదే తప్పని నిరూపించాలనుకుంటున్నారు. అందుకే నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లారు.
నిజానికి గోదావరిలో మునిగిన బోటును బయటకు తీయడం పెద్ద విషయం కాదని. నిపుణులు చాలా రోజుల నుంచి చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి… అత్యాధునిక టెక్నాలజీతో.. నిపుణుల్ని పిలిపించినా.. పైపైన ప్రయత్నాలు చేసి.. వెళ్లిపోయారు. ఇదంతా.. బోటు తీయకుండా ఉండటానికేనంటున్నారు. ఇప్పుడు.. హర్షకుమార్ నేరుగా సుప్రీంకోర్టులోనే పిటిషన్ వేయడంతో.. ఏపీ సర్కార్ కు కొత్త టెన్షన్ ప్రారంభమయినట్లయింది.