షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు ఇవ్వడంపై కాంగ్రెస్ లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆ పార్టీలో కొంత మంది నేతలు స్వాగతించినప్పటికీ.. షర్మిలను తీసుకుని పగ్గాలు అప్పగించడంపై కొంత మందికి ఇష్టం లేదు. ఇలాంటి నేతల్లో మాజీ ఎంపీ హర్షకుమార్ ఉన్నారు. ఇంకెవరూ ఏపీలో లేరా అని ప్రశ్నించారు. తెలంగాణకు చెందిన వై,ఎస్. షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు ఇవ్వొద్దని హర్షకుమార్ డిమాండ్ చేశారు. ఆ రాష్ట్రలో నిరాదరణకు గురైన ఆమె ఇక్కడెలా పనిచేయగలరని ప్రశ్నించారు.ఏపీలో కాంగ్రెస్ ను నడిపించే నాయకులు లేరా అని హర్షకుమార్ ప్రశ్నించారు.
ఏపీకీ ప్రత్యేక హోదా,విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టు పూర్తి, విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణ కాంగ్రెస్ తోనే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని, ఇప్పుడు తెలంగాణలో పుట్టానని చెప్పుకునే షర్మిలకు నాయకత్వం ఇస్తే అదంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి జగన్ ఇంటికి వెళ్ళిన షర్మిలతో అన్న జగన్ అరగంట మంతనాలు జరిపారని, మోడీని నేను చూసుకుంటాను.నువ్వు సోనియాను చూసుకో..ఎవరు అధికారంలోకి వచ్చినా మనం సేఫ్ గా ఉంటామని జగన్ చెప్పారని జనం భావిస్తున్నారని హర్షకుమార్ అన్నారు. ఇవన్నీ కాంగ్రెస్ అధిష్టానం గమనించాలని కోరారు. హర్షకుమార్ తన బలాన్ని చూపి ప్రధాన పార్టీల తరపున టిక్కెట్ పొందాలనుకుంటున్నారు.
అందుకే దళిత గర్జన ఏరక్పాటు చేస్తున్నారు. ఫిబ్రవరి 8 న దళిత సింహ గర్జన నిర్వహిస్తున్నామని.. సీఎం జగన్ దళితులను అన్ని రకాలుగా వంచించారని అంటున్నారు. అందుకే గద్దెనెక్కించిన దళితులే జగన్ ను గద్దె దించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. దళితులను జగన్ ఏవిధంగా దగా చేశారో దళిత సింహ గర్జన సభలో ప్రజలకు వివరిస్తామని చెబుతున్నారు.