గుజరాత్ లో 2002 అల్లర్లు తరువాత మళ్ళీ ఆ స్థాయిలో గత ఏడాది అల్లర్లు, విద్వంసం జరిగాయి. అందుకు కారణం పటేల్ కులస్తులకి రిజర్వేషన్లు కోరుతూ హార్దిక్ పటేల్ ప్రారంభించిన ఉద్యమమే. అకస్మాత్తుగా మొదలైన అతని ఉద్యమాన్ని ఏవిధంగా ఎదుర్కోవాలో తెలియక గుజరాత్ ప్రభుత్వం మొదట చాలా తికమకపడింది. చివరికి వారి ఒత్తిడికి లొంగి పటేల్ కులస్తులలో ఆర్ధికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్లు కల్పించడానికి అంగీకరించింది. అయినప్పటికే హార్దిక్ పటేల్ ప్రభుత్వానికి ఇంకా ఏవో సమస్యలు సృష్టిస్తుండటంతో అతనిని అరెస్ట్ చేయకతప్పలేదు. గుజరాత్ లో జరిగిన విద్వంసానికి అతనే బాధ్యుడని ఆరోపిస్తూ పోలీసులు అతనిపై కేసులు నమోదు చేశారు. ఆయన బెయిల్ కోసం అప్పీలు చేసుకోగా దానిపై విచారణ జరిపిన ఆ రాష్ట్ర హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
సాధారణంగా అటువంటి సందర్భాలలో ఏదో ఒక ప్రాంతం లేదా నియోజక వర్గం దాటి బయటకి వెళ్లరాదని న్యాయస్థానాలు షరతులు విదిస్తుంటాయి. కానీ గుజరాత్ హైకోర్టు మాత్రం అందుకు భిన్నంగా చాలా సంచలమైన తీర్పు చెప్పింది. హార్దిక్ పటేల్ కి ఆరు నెలలు రాష్ట్ర బహిష్కరణ విధించింది. ఆరు నెలల వరకు రాష్ట్రంలో అడుగుపెట్టడానికి వీలులేదని ఆదేశించింది. ఆయన కోర్టు ఆదేశాలని పాటిస్తూ పొరుగునే ఉన్న రాజస్థాన్ లోని ఉదయ పూర్ కి నిన్న తరలివెళ్లిపోయారు. అక్కడ ఒక ఎమ్మెల్యే ఇంట్లో ఆయన ఉండబోతున్నారు.
గుజరాత్ లో హార్దిక్ పటేల్ ఉద్యమానికి, ఏపిలో కాపులకి రిజర్వేషన్లు కోరుతూ ముద్రగడ పద్మనాభం మొదలుపెట్టిన ఉద్యమానికి చాలా దగ్గర పోలికలున్నాయి. కానీ ఆంధ్రా, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాలు వాటిపై స్పందించిన తీరు మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. గుజరాత్ లో కూడా భారీ విద్వంసం జరిగింది. అప్పుడు గుజరాత్ ప్రభుత్వం హార్దిక్ పటేల్ ని అందుకు బాద్యుడిని చేసి అతనిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసింది. హైకోర్టు ద్వారా ఆరు నెలలు రాష్ట్ర బహిష్కరణ చేయించింది. అయితే ఆయన చేసిన ఉద్యమం కారణంగానో లేకపోతే వచ్చే ఏడాది జరుగనున్న శాసనసభ ఎన్నికలని దృష్టిలో ఉంచుకోనో గుజరాత్ ప్రభుత్వం పటేళ్ళకి రిజర్వేషన్లు ప్రకటించింది.
కానీ ఆంధ్రాలో దానికి పూర్తి భిన్నంగా జరిగింది. తుని విద్వంసానికి ముద్రగడ పద్మనాభమే ప్రధాన కారకుడని వాదిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆయనని అరెస్ట్ చేసే సాహసం చేయలేకపోయింది. “ఉద్యమాల పేరుతో అరాచక శక్తులు విద్వంసానికి పాల్పడుతుంటే చేతులు ముడుచుకొని చూస్తూ కూర్చోవాలా?” అని ప్రశ్నించిన ప్రభుత్వమే అందుకు బాధ్యులని భావించి అరెస్ట్ చేసిన 11 మందిని కూడా ఆయన ఒత్తిడికి లొంగి విడుదలచేయక తప్పలేదు. నేటికీ ఆ విద్వంసానికి కారకులైన వారిని అరెస్ట్ చేసే సాహసం చేయలేకపోతోంది. గుజరాత్ ప్రభుత్వం పటేళ్ళకి రిజర్వేషన్లు కల్పించింది కానీ ఏపి ప్రభుత్వం మాత్రం ఇంతవరకు కాపులకి రిజర్వేషన్లు కల్పించలేకపోయింది.