దేశంలో ప్రాంతీయవాదం.. మరో స్టేజ్‌కు చేరుతోంది. తమ రాష్ట్రంలో ఉద్యోగాలు తమకే దక్కాలంటూ.. రాష్ట్రాలు చట్టాలు చేస్తున్నాయి. ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఎవరైనా వ్యాపారం చేయాలన్నా.. పరిశ్రమ పెట్టాలన్నా.. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని చట్టం చేశారు. ఆ తర్వాత ఒక్కటంటే ఒక్క సంస్థ కూడా ఏపీలో పెట్టేందుకు వచ్చిన దాఖలాలు లేవు.. అది వేరే విషయం. ఇప్పుడు..జగన్ బాటలోనే.. హర్యానా కూడా నడిచింది. హర్యానాలోని ప్రైవేట్ సంస్థల్లో 75 శాతం ఉద్యోగాలు ఆ రాష్ట్రానికి చెందిన యువతకే ఇవ్వాలనే.. ఆర్డినెన్స్‌కు అక్కడి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
నిజానికి హర్యానా, చండీగఢ్‌లో.. వలస కార్మికులే అత్యధికం ఉంటారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ప్రాంతం కావడంతో.. యూపీ, బీహార్‌కు చెందిన వారు పెద్ద ఎత్తున హర్యానాకు వచ్చి పనులు చేసుకునేవారు. లాక్డౌన్ హర్యానా పరిశ్రమలపై బాగా ప్రభావం చూపింది. చాలా మంది వలస కార్మికులు వెనక్కి వెళ్లిపోయారు. ఇప్పుడు పరిశ్రమలు తెరుద్దామన్నా.. మ్యాన్ పవర్ దొరకని పరిస్థితి ఉంది. అదే సమయంలో.. ఎన్నికల సమయంలో జేజేపీ పార్టీ నేత దుష్యంత చౌతాలా స్థానికులకే.. 75 శాతం ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చారు. దాన్ని ఇప్పుడు ఇలా నేరవేర్చారు.
పలు రాష్ట్రాలు ఇప్పుడు.. ఈ 75 శాతం.. కోటా దిశగా అడుగు వేస్తున్నాయి. కర్ణాటకలోనూ.. ఇలాంటి డిమాండ్‌తో.. ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆ చట్టం చేస్తామని ముఖ్యమంత్రి యడ్యూరప్ప చెబుతూ వస్తున్నారు. తమిళనాడు, మహారాష్ట్రల్లోనూ ఇలాంటి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇలాంటి చట్టాలు చేయడం వల్ల… ఆయా రాష్ట్రాలకు స్కిల్డ్ లేబర్ దొరకడం కష్టమవడం మాత్రమే కాదు.. పారిశ్రామికంగా వెనుకబడిన రాష్ట్రాల ప్రజలకు ఉపాధి కరవవుతుంది. ఇలాంటి నిబంధనల లేబర్ దొరకరదన్న ఉద్దేశంతో చాలా సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఆయా రాష్ట్రాల వైపు చూసే అవకాశం కూడా లేదంటున్నారు. అయినా ప్రజల సెంటిమెంట్‌కే ప్రాధాన్యం ఇచ్చి… రాష్ట్రాలు స్థానిక చట్టాలు చేస్తున్నాయి.