హర్యానా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ధ్రిల్లర్ ను తలపించేలా సాగుతున్నాయి. కౌంటింగ్ ప్రారంభించిన మొదట్లో హర్యానాలో కాంగ్రెస్ పూర్తి స్థాయి ఆధిక్యతను చూపించినా అది రాను రాను పడిపోయింది. చివరికి మ్యాజిక్ మార్క్ 46 సాధించడం కష్టమే అన్నట్లుగా కౌంటింగ్ మధ్యలోకి వచ్చే సరికి సీన్ మారిపోయింది. అదే జమ్మూకశ్మీర్లో హంగ్ ఖాయం అనుకున్నారు కానీ.. కౌంటింగ్ ముందుకు సాగే కొద్దీ నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమికి స్పష్టమైన ఆధిక్యత పెరుగుతూ వచ్చింది.
రెండు రాష్ట్రాల్లోనూ 90 చొప్పున అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. మెజార్టీ మార్క్ 46. రెండు చోట్ల కాంగ్రెస్ కూటమి ఆధిక్యత చూపిస్తోంది కానీ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించినంత ఏకపక్షంగా లేవు. ఓ రకంగా చెప్పాలంటే రెండు రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్ తలకిందులయ్యే అవకాశం కనిపిస్తోంది. హర్యానా ఫలితాలు ఒక్క సారిగా తలకిందులు కావడం ఆ పార్టీని షాక్కు కురి చేసేదే. ఇండియన్ నేషనల్ లోక్ దళ్ పార్టీ అక్కడ కీలకంగా మారనుంది. అదే జరిగితే బీజేపీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.
జమ్మూకశ్మీర్లో ఒమర్ అబ్దుల్లాకు కాలం కలసి వస్తోంది. ఆయన పార్టీకే మ్యాజిక్ మార్క్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ మద్దతు కలుపుకుంటే తిరుగులేని మెజార్టీ వచ్చినట్లే. బీజేపీ తరపున కశ్మీర్లో పనులు చక్కబెట్టిన కిషన్ రెడ్డి, రామ్ మాధవ్ల మ్యాజిక్ పని చేయలేదని అనుకోవచ్చు. కౌంటింగ్ పూర్తయ్యే సరికి ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో చూడాల్సి ఉంది.