హర్యానా ప్రభుత్వం రాష్ట్రంలో గోవధ, బీఫ్ (పశు మాంసం) తినడాన్ని నిషేదించింది. ఒకవేళ ఎవరయినా ఆ చట్టాన్ని ఉల్లంఘించినట్లయితే వారికి 3-10 వరకు జైలు శిక్ష విదించబడుతుంది కనుక ఆ రాష్ట్రంలో ప్రజలు బీఫ్ తినడం మానేసి ఉంటారని అనుకోవలసి ఉంటుంది. కానీ ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి అనిల్ విజ్ మాత్రం ఇంకా బీఫ్ గురించే మాట్లాడుతూ మీడియా దృష్టిని ఆకర్షిస్తున్నారు.
‘బీఫ్ తినకుండా ఉండలేనివారు మా రాష్ట్రానికి రావద్దని’ అయన సూచించారు. అందుకు ఆయన మంచి రీజనింగ్ కూడా ఇచ్చారు. “కొన్ని దేశాలలో ఆహారపు అలవాట్లు మనకి సరిపోనప్పుడు అక్కడికి వెళ్ళడానికి మనం ఏవిధంగా ఇష్టపడమో, అదేవిధంగా బీఫ్ తినకుండా ఉండలేని వారు కూడా మా రాష్ట్రం రాకుండా ఉంటేనే మంచిది,” అని సూచించారు.
బీహార్ ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రజలను రెచ్చగొట్టి తమవైపు తిప్పుకొనేందుకు ఈ ‘బీఫ్, ‘మత అసహనం’ అంశాలని హైలైట్ చేసాయి. ఆ తరువాత అవి వాటి గురించి మళ్ళీ మాట్లాడలేదు. కానీ హర్యానా ఆరోగ్య మంత్రి మాత్రం ఇంకా బీఫ్ దగ్గరే ఆగిపోయారు. హర్యానాలో వచ్చే ఏడాది వరకు ఎన్నికలు లేవు. అటువంటప్పుడు ఇటువంటి సున్నితమయిన అంశాలపై మాట్లాడటం దేనికో తెలియదు. సాధారణంగా ఇటువంటి విషయాలలోనే ఏదో ఒక సమయంలో రాజకీయ నాయకులు నోరు జారి ఇబ్బందులలో పడుతుంటారు. బహుశః ఆరోగ్య మంత్రిగారికి కూడా అటువంటి చేదు అనుభవం ఏదో ఎదురయ్యేవరకు ఇలాగ మాట్లాడుతూనే ఉంటారేమో?