విభజన చట్టంలోని అంశాలు, కేంద్రం ఇచ్చిన హామీలు అమలు చేసే వరకూ కేంద్రంపై ఒత్తిడి పెంచే వ్యూహంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఉన్నారనే సంగతి తెలిసిందే. దీన్లో భాగంగానే ముందుగా కేంద్ర క్యాబినెట్ లోని టీడీపీ మంత్రులతో రాజీనామాలు చేయించారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా మాత్రం కొనసాగుతున్నారు. మంత్రి పదవులను వదులుకోవడం వల్ల కేంద్రంపై పోరాటం చేసేందుకు మరింత స్వేచ్ఛ దొరుకుతుందని సుజనా చౌదరి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఇదంతా కేంద్రంపై తొలిదశ పోరాటంగానే చెప్పారు. ఇప్పుడు మలిదశ అంటే.. ఎన్డీయే నుంచి పూర్తిగా బయటకి రావడమే కదా మిగులుంది! తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఆ దిశగానే ఉన్నాయనే అభిప్రాయం కలుగుతోంది.
పార్టీకి చెందిన ముఖ్యనేతలతో భేటీ అయిన సీఎం, భాజపాపై కొన్ని తీవ్రమైన విమర్శలు చేశారు. భాజపాతో పొత్తు పెట్టుకోవడం వల్ల తెలుగుదేశం పార్టీకి కొత్తగా ఒరిగిందేం లేదన్నారు. సాధారణ ఎన్నికలకు ముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించిదని చెప్పారు. భాజపాతో పొత్తు తరువాత సాధారణ ఎన్నికలు జరిగాయనీ, అయినా టీడీపీకి అదనంగా పెరిగిన ఓట్లు ఏవీ లేవన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్ని వచ్చాయో, పొత్తు తరువాత కూడా అదే సంఖ్య ఉందన్నారు. అయితే, రాష్ట్రానికి ఏదైనా మేలు జరిగే అవకాశం ఉంటుందన్న ఆలోచనతోనే భాజపాతో పొత్తు పెట్టుకున్నామన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై మూడు రోజులుగా అడుగుతుంటే కేంద్రం నుంచి సరైన స్పందన రావడం లేదన్నారు. యుటిలైజేషన్ సర్టిఫికెట్లు పంపించడం లేదంటూ భాజపా నేతలు చేస్తున్న ఆరోపణల్ని ఖండించారు. అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ, యూసీలు పంపుతూనే ఉన్నామన్నారు. రాష్ట్రానికి సాయం చేయాల్సిన కేంద్రమే ఇప్పుడు మనపై ఎదురుదాడికి దిగుతున్నట్టుగా ఉందన్నారు.
ఇంతవరకూ కేంద్ర కేటాయింపులు, రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన ప్రయోజనాల గురించి మాత్రమే చంద్రబాబు మాట్లాడుతూ వచ్చారు. ఈ క్రమంలో భాజపాతో పొత్తు విషయమై ఎలాంటి వ్యాఖ్యలు చెయ్యలేదు. అంతెందుకు, మొన్న అసెంబ్లీలో కూడా దాదాపు రెండున్నర గంటలు ప్రసంగం చేసినా… భాజపా తమకు మిత్రపక్షమనీ, అందుకే సంయమనం పాటిస్తూ రాష్ట్ర హక్కుల్ని అడుగుతున్నామనే మాట్లాడారు. కానీ, ఇలా ‘భాజపాతో పొత్తు వల్ల టీడీపీకి లాభం లేద’నే వ్యాఖ్యలు ఆయన చేయడం కాస్త ప్రత్యేకంగా కనిపిస్తోంది. మంత్రుల రాజీనామా తొలి దశ అన్నారు, ఇక మలిదశ అంటే ఎన్డీయే నుంచి కూడా బయటకి రావడం మాత్రమే కదా! దీనిపై పార్టీలో చర్చించాక నిర్ణయం ఉంటుందని నేతలు అంటున్నారు. చంద్రబాబు ఇలా వ్యాఖ్యానించడం మలిదశ కార్యాచరణకు సంకేతాలుగా అనిపిస్తున్నాయి.