వైఎస్ అస్తిత్వ పునాదులపై నిర్మాణమైన వైసీపీ ఇక రాజకీయం మార్చబోతుందా..? వైఎస్సార్ పేరుతో రాజకీయం చేయవద్దని జగన్ రెడ్డి డిసైడ్ అయ్యారా..? ఈ తరహా రాజకీయం తనకు మరింత ప్రమాదంగా పరిణమిస్తుందని జగన్ భావిస్తున్నారా..? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు.
జులై 8న వైఎస్సార్ జయంతి వేడుకలను విజయవాడలో నిర్వహించేందుకు షర్మిల ప్లాన్ చేస్తుండగా..జగన్ మాత్రం ఉలుకుపలుకు లేకుండా ఉండిపోవడం చర్చనీయాంశంగా మారింది. తండ్రి జయంతి ఉత్సవాలను చేపట్టేందుకు జగన్ ఎందుకు ఊగిసలాడుతున్నారనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. అయితే, షర్మిల వైఎస్సార్ బొమ్మతోనే రాజకీయం చేస్తుండగా.. జగన్ కూడా ఇదే తరహ రాజకీయం చేస్తే ఇబ్బంది అవుతుందన్న ఆలోచనతోనే జగన్ ఆగిపోయారా..? అనే చర్చ జరుగుతోంది.
వైఎస్ పేరును ఉచ్చరించే అర్హత జగన్ కు లేదని ఎన్నికల ప్రచారంలో షర్మిల మండిపడ్డారు. వైఎస్సార్ అభిమానులు కాంగ్రెస్ ను బలపరచాలని కోరారు. వైఎస్ కాంగ్రెస్ పేటెంట్ అని స్పష్టం చేశారు. ఆ ఎన్నికల్లో షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభావం చూపకపోయిన ఎంతో కొంత ఓటు బ్యాంక్ ను కైవసం చేసుకుంది. దీంతో వైఎస్సార్ పేరుతో రాజకీయం చేస్తే తనకు ఇబ్బంది అవుతుందన్న అంచనాతో జగన్ ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
భవిష్యత్ రాజకీయాన్ని అంచనా వేసే జగన్ , షర్మిలకు ధీటుగా వైఎస్ జయంతి నిర్వహించడం లేదా..? లేక, ఇప్పుడు కొత్తగా చేస్తే మరిన్ని విమర్శలు వస్తాయనే సైలెంట్ గా ఉన్నారా..? అనే చర్చ జరుగుతోంది. గతంలో సీఎంగా ఉండటంతో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండటంతో ఆగిపోయినా, ఇప్పుడు జగన్ ఎమ్మెల్యేగానే ఉన్నారు. తండ్రి జయంతిని ఘనంగా నిర్వహించే అవకాశం ఉన్నా ఎందుకు చడీ చప్పుడు చేయడం లేదన్న ప్రశ్నలు వస్తున్నాయి.
వైఎస్ ను కాంగ్రెస్ పేటెంట్ గా జగన్ గుర్తించే కేవలం నివాళులు అర్పించి మౌనంగా ఉండాలని నిర్ణయించుకున్నారు అనే వాదనలు వినిపిస్తున్నాయి.