తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ, బీఆర్ఎస్ పార్టీలది ఒకే రకమైన కథ. అధికార పార్టీలుగా ఓ వెలుగు వెలిగి అనూహ్యంగా ప్రతిపక్ష పాత్రలోకి జారుకున్నాయి. బీఆర్ఎస్ కంటే కూడా వైసీపీ ఘోరమైన పరాభవం చవిచూడటంతో ఆ పార్టీ నేతలు వైసీపీకి గుడ్ బై చెప్తున్నారు. ఇంకొంతమంది రాజకీయ సన్యాసం ప్రకటించేశారు. బీఆర్ఎస్ లో ఇంచుమించుగా ఇదేరకమైన పరిస్థితి నెలకొన్నా..ఆ పార్టీ ఓటమి నుంచి పాఠాలను నేర్చుకోవాలని తపిస్తోంది. వైసీపీ మాత్రం అలాంటి ప్రయత్నాలు చేయకపోవడం ఆ పార్టీ క్యాడర్ ను నిరాశకు గురి చేస్తోంది.
బీఆర్ఎస్ ఫీనిక్స్ లా మళ్లీ లేస్తుందని కేటీఆర్ పదేపదే చెప్తున్నారు. అయినా కొంతమంది నేతలు మాత్రం కారు దిగుతుండటంతో వచ్చే ఐదేళ్లనాటికి బీఆర్ఎస్ కు గడ్డు పరిస్థితులు తప్పేలా లేవనే అభిప్రాయం వినిపిస్తోంది. దీంతో ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు డీఎంకేను స్పూర్తిదాయకంగా తీసుకోవాలని కేటీఆర్ సారధ్యంలో తమిళనాడు వెళ్లనున్నారు. అనేకసార్లు ఓటమి పలకరించినా , చిత్తుచిత్తుగా ఓడినా డీఎంకే మళ్లీ ఎలా నిలదొక్కుకోగలిగింది అనేది తెలుసుకునేందుకు తమిళనాడు వెళ్తున్నారు. ఇలా బీఆర్ఎస్ ను పటిష్టం చేసుకునేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది.
కానీ, ఇంచుమించుగా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్న వైసీపీ మాత్రం నిద్రావస్థలో ఉన్నట్టే కనిపిస్తోంది. నేతలు వరుసగా పార్టీని వీడుతున్నారు. క్యాడర్ కూడా ఆందోళనలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీకి అండగా నిలబడాల్సిన నాయకుడు ఫారిన్ వెళ్తారా..? అని వైసీపీలో అసహనం వ్యక్తం అవుతోంది. కనీసం బీఆర్ఎస్ తరహాలోనైనా వైసీపీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవడం లేదంటే.. వైసీపీ ఉనికిపై జగన్ ఆశలు వదిలేసుకున్నారా..? అని గుసగుసలు వినిపిస్తున్నాయి.