బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ అసలు విషయాన్ని గ్రహించినట్టు ఉన్నారు. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నా కనీసం నిలువరించే ప్రయత్నం చేయడం లేదు. మొదట్లో ఈ ప్రయత్నాలు చేసినా వర్కౌట్ అవ్వలేదనుకున్నారో ఏమో, మరికొంతమంది ఎమ్మెల్యేలు పార్టీని వీడెందుకు సిద్దం అవుతున్నా కనీసం వారితో చర్చించేందుకు సిద్దపడటం లేదు.
పార్టీని వీడాలనుకునే ఎమ్మెల్యేలను బుజ్జగించే టాస్క్ ను కేటీఆర్, హరీష్ రావులలో ఎవరో ఒకరికైనా కేసీఆర్ అప్పగించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. 15 రోజుల్లో కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అవుతుందని కాంగ్రెస్ నేతలు ధీమాగా చెబుతుండటంతో అదే జరుగుతుందని కేసీఆర్ ఫిక్స్ అయినట్టు ఉన్నారు. అందుకే కాంగ్రెస్ నేతలతో టచ్ లో ఉన్న బీఆర్ఎస్ నేతలతో కనీసం సంప్రదింపులు కూడా జరపడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
మరోవైపు కేసీఆర్ వైఖరిపై సొంత పార్టీలోనే అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఎమ్మెల్యేలను చేజారిపోకుండా చూడాల్సిన అధినేత ఫామ్ హౌజ్ కు పరిమితమైతే..పార్టీని ఎలా కాపాడుతారని సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు. అయితే, ఎమ్మెల్యేలు పార్టీని వీడకుండా కేసీఆర్ చెప్పాల్సింది చెప్పారు. కానీ , పోయేవారిని బలవంతంగా ఆపలేరు కదా. అందుకే వలసల విషయంలో కేసీఆర్ కూడా సైలెంట్ అయ్యారని పార్టీలోనే మరో వాదన వినిపిస్తోంది.
మొత్తానికి కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ నేతల చేరికల స్పీడ్ చూస్తుంటే.. కేసీఆర్ సైతం కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కావడం ఖాయమనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.